Seedance 2.0: హాలీవుడ్‌లో చైనా AI చిచ్చు! టామ్ క్రూజ్ Vs బ్రాడ్ పిట్.. అసలు ఏం జరిగిందంటే
ఎఐ టెక్నాలజీపై హాలీవుడ్‌లో కొత్త వివాదం స్టార్స్ మధ్య పోలికలతో సోషల్ మీడియాలో చర్చలు
వినోద ప్రపంచం ఇప్పుడు ఒక వింతైన, భయంకరమైన యుద్ధాన్ని ఎదుర్కొంటోంది. నిన్నటి వరకు మనుషులు మాత్రమే చేయగలరని అనుకున్న పనులను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిటికెలో చేసేస్తోంది. టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ (ByteDance) తాజాగా విడుదల చేసిన 'సీడెన్స్ 2.0' అనే AI వీడియో మోడల్ ఇప్పుడు హాలీవుడ్ పునాదులను కదిలిస్తోంది. ఇంతకీ ఆ ఏఐ వీడియోలో ఏం ఉంది, ఎందుకని హాలీవుడ్ సర్కిల్‌లో ఈ వీడియోపై అంతటి చర్చ జరుగుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అసలేం జరిగిందంటే..
బైట్‌డాన్స్ తన కొత్త AI టూల్‌ను విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ఇంటర్నెట్‌లో వీడియోల వరద మొదలైంది. అయితే ఇవి మామూలు వీడియోలు కావు. టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ ఒకరితో ఒకరు భీకరంగా తలపడటం, రాకీ బాల్బోవా, ఆప్టిమస్ ప్రైమ్ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, చాలా ఫేమస్ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' కు ఎవరూ ఊహించని కొత్త క్లైమాక్స్ ఇవ్వడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిజానికి ఈ వీడియోలు ఎంత రియలిస్టిక్‌గా ఉన్నాయంటే, సామాన్య ప్రేక్షకులు ఏది నిజమో, ఏది AI సృష్టించిందో గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. అయితే ఈ వీడియోలపై హాలీవుడ్ స్టూడియోలు, నటుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
* హాలీవుడ్ అగ్రశ్రేణి స్టూడియోల తరపున చార్లెస్ రివ్‌కిన్ ఘాటుగా స్పందించారు. "ఒకే ఒక్క రోజులో బైట్‌డాన్స్ అమెరికాకు చెందిన వేలకొద్దీ కాపీరైట్ మెటీరియల్‌ను అనధికారికంగా వాడేసింది. ఇది కాపీరైట్‌లను హరించడమే కాకుండా, మిలియన్ల కొద్దీ ఉద్యోగాలను ప్రమాదంలో నెట్టడమే" అని ఆయన మండిపడ్డారు.
* ప్రముఖ నటుల సంఘం SAG-AFTRA ఈ ఉదంతాన్ని 'స్పష్టమైన ఉల్లంఘన'గా పేర్కొంది. ఒక నటుడి అనుమతి లేకుండా వారి గొంతును, ముఖాన్ని (Likeness) ఉపయోగించి వీడియోలు చేయడం వల్ల వారి జీవనోపాధి దెబ్బతింటుందని యూనియన్ వాదిస్తోంది.
గతంలో OpenAI యొక్క Sora 2 విడుదలైనప్పుడు కూడా ఇలాంటి సంఘటనలే చోటుచేసుకున్నాయి. అప్పట్లో నటుడు బ్రయాన్ క్రాన్‌స్టన్ తన అనుమతి లేకుండా వీడియోలు రావడాన్ని ప్రశ్నించడంతో, OpenAI వెనక్కి తగ్గి 'ఆప్ట్-ఇన్' (కళాకారుల అనుమతి తీసుకోవడం) పద్ధతిని ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు చైనా కంపెనీ బైట్‌డాన్స్ ఏకంగా చట్టాలను, హక్కులను విస్మరిస్తోందని హాలీవుడ్ పరిశ్రమ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. AI వాడకంపై హాలీవుడ్ నటులు ఇప్పటికే 2023, 2024లలో సుదీర్ఘ సమ్మెలు చేశారు. ఇప్పుడు 2026 కార్మిక ఒప్పంద చర్చలు జరుగుతున్న తరుణంలో, 'సీడెన్స్ 2.0' సృష్టించిన రచ్చ ఈ చర్చలను మరింత క్లిష్టతరం చేసేలా ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీ పెరగడం మంచిదే అయినా, అది ఒక మనిషి ఉనికిని, కష్టాన్ని హరించేలా ఉండకూడదని హాలీవుడ్ నిర్మాతలు, నటీనటులు వాదిస్తున్నారు. మరి ఈ 'AI యుద్ధం' ఎటు దారితీస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.