USA-Iran War : మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా? ఇరాన్‌పై అణుబాంబు వేస్తామన్న ట్రంప్
USA-Iran War : అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతోంది. హోర్ముజ్ జలసంధి తెరవకుంటే ఇరాన్‌ను రాతి యుగానికి పంపిస్తామని ట్రంప్ హెచ్చరించగా, అమెరికా డిమాండ్లు అర్థరహితమని ఇరాన్ కొట్టిపారేసింది.
USA-Iran War
USA-Iran War : అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఏప్రిల్ 2, 2026 నాటి తాజా పరిణామాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి సిద్ధమవుతుండగా, ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వాషింగ్టన్ పెడుతున్న నిబంధనలు అత్యంత అహేతుకమని, శాంతి చర్చలు ఏవీ జరగడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి.
అమెరికా నిబంధనలు అర్థరహితం: ఇరాన్
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపడానికి అమెరికా పెడుతున్న షరతులు ఏమాత్రం హేతుబద్ధంగా లేవని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయ్ మండిపడ్డారు. పాకిస్తాన్ వంటి మధ్యవర్తుల ద్వారా సందేశాలు అందుతున్న మాట వాస్తవమే కానీ, అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా పదేపదే చేస్తున్న డిమాండ్లు అణచివేత ధోరణితో ఉన్నాయని, ఒకవేళ అమెరికా దళాలు భూతల దాడులకు దిగినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ హెచ్చరించింది.
ట్రంప్ మాస్ వార్నింగ్
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. "స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరిచి, నౌకల రాకపోకలకు అనుమతించాలి. లేదంటే ఇరాన్‌ను నామరూపాలు లేకుండా చేస్తాం.. తిరిగి రాతి యుగానికి పంపిస్తాం" అంటూ తన ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. ఇరాన్ అధ్యక్షుడు శాంతి చర్చల కోసం అడిగారని ట్రంప్ చెబుతుండగా, ఇరాన్ మాత్రం ఆ వార్తలను తోసిపుచ్చింది. నేడు ట్రంప్ ఇచ్చే టెలివిజన్ ప్రసంగంపై ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దెబ్బ
ప్రపంచవ్యాప్త చమురు మరియు గ్యాస్ ఎగుమతుల్లో ఐదో వంతు ప్రయాణించే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ను ఇరాన్ విప్లవాత్మక దళాలు మూసివేయడంతో ఎనర్జీ మార్కెట్ అతలాకుతలమైంది. అమెరికాలో గ్యాసోలిన్ ధరలు గరిష్ట స్థాయికి చేరగా, ఐరోపాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఒకవైపు యుద్ధం వల్ల ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు సంభవిస్తుండగా, ఇరాన్ సైతం ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, ఎలియట్ నగరాలతో పాటు బహ్రెయిన్, కువైట్‌లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది.
అల్లకల్లోలంగా మధ్యప్రాచ్యం
ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో లెబనాన్‌లోని బీరూట్ అగ్నిగుండంగా మారింది. మార్చి 2 నుంచి జరుగుతున్న ఈ పోరులో లెబనాన్‌లో ఇప్పటివరకు 1,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో, సౌదీ అరేబియా, యూఏఈలలో కూడా డ్రోన్ల దాడులు కలకలం రేపుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన తండ్రి మరణం తర్వాత మొదటిసారి స్పందిస్తూ.. అమెరికా, ఇజ్రాయెల్ శత్రువులకు ఎలాంటి మానవత్వ విలువలు లేవని విమర్శించారు. అంతం వరకు పోరాడుతామని ఇరాన్ ప్రజలు ప్రతినబూనుతున్నారు.