Internet Down: యుద్ధం ముదిరితే ఇంటర్నెట్ ఆగిపోతుందా? భారత్ పరిస్థితి ఏమిటి?
Internet Down: మధ్యప్రాచ్యంలో యుద్ధం ఇప్పుడు ఆయిల్ సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపింది. మరి ఇలానే కొనసాగితే ఇంటర్నెట్ కూడా ఆగిపోతుందా? ఆ భయం ఎందుకు?
Internet Down
Internet Down: ఇరాన్ పై ఇజ్రాయేల్, అమెరికా సంయుక్త దాడి ప్రపంచానికి ముప్పు తెచ్చేదిగా మారింది. ఒక పక్క యుద్ధాన్ని ఆపేస్తాము అంటూనే మరో పక్క దాడులను కొనసాగిస్తూ పోతోంది అమెరికా. ప్రపంచ ఆయిల్ సరఫరాకు కేంద్ర బిందువుగా ఉన్న హార్మూజ్ జలసంధిని ఇప్పటికే ఇరాన్ దిగ్బంధనం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయిల్ సరఫరా నిలిచిపోయి అనేక దేశాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. అయితే, దానిని మించిన సంక్షోభం మరోటి ఉందని వార్తలు వస్తున్నాయి. యుద్ధం మరింత ముదిరి ఇరాన్ కనుక మరింత తెగిస్తే.. ప్రపంచం మొత్తం డిజిటల్ గా స్తంభించి పోతుందని భయపడుతున్నారు. అసలు ఇరాన్ కి ఇంటర్నెట్ కి సంబంధం ఏమిటి? ఒకవేళ ఇంటర్నెట్ ఆగిపోయే పరిస్థితి వస్తే కనుక మన దేశ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
హార్మూజ్ కింద ఇంటర్నెట్ కేబుళ్లు..
ప్రపంచ ఇంధన సంక్షోభం నేపథ్యంలో, అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణతో ప్రభావితమైన హార్మూజ్ జలసంధి ఇప్పుడు ఇంటర్నెట్ అంతరాయాల ప్రమాదంలో ఉంది. ఎందుకంటే, హార్మూజ్ జలసంధి ప్రపంచంలోని 20% ముడి చమురును, 25% ఎల్ఎన్జిని రవాణా చేయడమే కాకుండా, దాని కింద ఇంటర్నెట్ కేబుళ్లను కూడా కలిగి ఉంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగినా లేదా కేబుళ్లు దెబ్బతిన్నా, భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వేగం తగ్గిపోవచ్చు. ఈ ప్రాంతం కేవలం ఇంధన సంక్షోభ కేంద్రం మాత్రమే కాకుండా, డిజిటల్ సంక్షోభ కేంద్రం కూడా అని నిపుణులు భావిస్తున్నారు.
ప్రపంచ డేటాలో 97% సముద్రం కింద..
మనమందరం ఇంటర్నెట్ ఉపగ్రహం ద్వారా పనిచేస్తుందని భావిస్తాం. కానీ, వాస్తవం వేరు. ప్రపంచంలోని డేటాలో సుమారు 95 నుండి 97 శాతం ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ కేబుళ్లను సముద్రం కింద వేస్తారు. భారతదేశాన్ని ఐరోపా, ఆఫ్రికా, పశ్చిమ ఆసియాతో కలిపే ప్రధాన కేబుళ్లు ఈ మార్గం గుండా వెళ్తాయి. వీటిలో SEA-ME-WE, AAE-1, EIG వంటి ప్రధాన కేబుల్ వ్యవస్థలు ఉన్నాయి.
మనదేశానికి ముప్పు ఎంత?
భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఈ సముద్ర మార్గాలపై ఎక్కువగా ఆధారపడి ఉంది. భారతదేశ అంతర్జాతీయ ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్‌లో అధిక భాగం అరేబియా సముద్రం, గల్ఫ్ ప్రాంతం ద్వారా వస్తుంది.
లేటెన్సీ పెరుగుతుంది: కేబుళ్లు దెబ్బతింటే, ట్రాఫిక్‌ను పొడవైన పసిఫిక్ మార్గానికి మళ్లించాల్సి ఉంటుంది. దీనివల్ల లేటెన్సీ, అంటే డేటా ప్రయాణ సమయం పెరుగుతుంది.
ఇంటర్నెట్ నెమ్మదిగా ఉంటుంది: యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో బఫరింగ్ పెరుగుతుంది. వీడియో కాల్స్, క్లౌడ్ సేవల్లో కూడా సమస్యలు తలెత్తవచ్చు.
23.48 లక్షల కోట్ల ఐటీ రంగంపై ప్రభావం
భారతదేశ ఐటీ, అవుట్‌సోర్సింగ్ రంగం విలువ సుమారుగా 250 బిలియన్ డాలర్లు (23.48 లక్షల కోట్ల రూపాయలు). అమెరికన్, యూరోపియన్ క్లయింట్‌లతో రియల్-టైమ్ కనెక్టివిటీ ఈ తక్కువ లేటెన్సీ నెట్‌వర్క్‌పై ఆధారపడి ఉంటుంది. కేబుల్ తెగిపోవడం వల్ల కంపెనీలకు గణనీయమైన నష్టాలు వాటిల్లవచ్చు. ఇది సర్వీస్ అగ్రిమెంట్స్ (SLAలు) ఉల్లంఘనలకు, జరిమానాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా, గల్ఫ్ దేశాల నుండి వచ్చే మనీ ట్రాన్సఫర్స్, SWIFT వంటి బ్యాంకింగ్ లావాదేవీలు కూడా స్లో అయిపోవచ్చు.
ఇంటర్నెట్‌ను పూర్తిగా నిలిపివేస్తారా?
ఒక మార్గం మూసుకుపోతే, ట్రాఫిక్ మరొక మార్గానికి మళ్లించబడే విధంగా ఇంటర్నెట్ రూపొంది ఉంటుంది. అందువల్ల, ఇంటర్నెట్ కు పూర్తి అంతరాయం ఏర్పడే అవకాశం లేదు. అయితే, మార్గాన్ని మార్చడం ప్రత్యామ్నాయ మార్గాలపై భారాన్ని పెంచుతుంది, దీనివల్ల వేగం గణనీయంగా తగ్గుతుంది. స్టాక్ మార్కెట్, హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ వంటి మిల్లీసెకన్లు కూడా ముఖ్యమైన రంగాలలో, ఇది గణనీయమైన ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు.
ప్రత్యామ్నాయ మార్గాల వైపు భారత్ చూపు..
ఈ ముప్పును ఎదుర్కొంటూ, భారతదేశంతో సహా అనేక దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ వంటి శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఒక బ్యాకప్‌గా పరిగణిస్తున్నారు.
భవిష్యత్తులో, సున్నితమైన ప్రాంతాలను దాటుకుంటూ వెళ్లేలా కేబుళ్లను వేయడానికి ప్రణాళికలు ఉన్నాయి. ప్రస్తుతానికి, చమురు ధరల కంటే హార్మూజ్ లో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే డిజిటల్ ప్రపంచంలో ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నాయి.