Hormuz: హోర్ముజ్ జలసంధిలో ఉత్కంఠ.. భారత నౌకల సాహసం

Hormuz: పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి వద్ద భారత నౌకల పరిస్థితి.

Update: 2026-04-04 04:18 GMT

Hormuz: హోర్ముజ్ జలసంధిలో ఉత్కంఠ.. భారత నౌకల సాహసం

Iran Oil: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ, ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హోర్ముజ్ జలసంధి వద్ద యుద్ధ నౌకలు, ట్యాంకర్ల మధ్య హైడ్రామా నడుస్తోంది. ప్రాణాలకు తెగించి భారతీయ జెండా కలిగిన నౌకలు స్వదేశానికి చేరుకుంటుంటే, మరోవైపు అంతర్జాతీయ రాజకీయాలు చమురు వ్యాపారాన్ని శాసిస్తున్నాయి.

యుద్ధాన్ని దాటి వచ్చిన గ్రీన్ సాన్వి

భారతీయ జెండా రెపరెపలాడుతున్న ఏడవ ఎల్పీజీట్యాంకర్ గ్రీన్ సాన్వి శుక్రవారం విజయవంతంగా హోర్ముజ్ జలసంధిని దాటింది. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు ఆరు భారతీయ నౌకలు ఈ ప్రమాదకరమైన జలసంధిని దాటి క్షేమంగా భారత ఓడరేవులకు చేరుకున్నాయి. భారత నౌకాదళం అందిస్తున్న పక్కా సూచనలు, రక్షణ కవచం వల్లే ఇది సాధ్యమవుతోంది.

సముద్రంలో ఉత్కంఠ

ప్రస్తుతం హోర్ముజ్ జలసంధికి పశ్చిమ దిశలో సుమారు 17 భారతీయ నౌకలు చిక్కుకుపోయాయి. అందులో ఎల్పీజీతో నిండిన గ్రీన్ ఆశా, జగ్ విక్రమ్ అనే రెండు కీలక నౌకలు ఉన్నాయి. పర్షియన్ గల్ఫ్‌లోని అబు మూసా ద్వీప సమీపంలో ఈ నౌకలు ప్రస్తుతం భారత నౌకాదళం నుండి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాయి. ఏ క్షణమైనా ఇవి భారతదేశం వైపు ప్రయాణం ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇరాన్ చమురు నౌక మిస్టరీ

ఈ యుద్ధ సమయంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఆరేళ్ల తర్వాత తొలిసారిగా ఇరాన్ నుండి భారత్‌కు ముడి చమురు తీసుకువస్తోందని భావిస్తున్న పింగ్ షున్ అనే విదేశీ ట్యాంకర్ అకస్మాత్తుగా తన గమ్యాన్ని మార్చుకుంది. మొదటిగా గుజరాత్‌లోని వడినార్ పోర్టుకు రావాల్సి ఉంది. ప్రస్తుతం అది చైనాలోని డోంగింగ్ వైపు వెళ్తున్నట్లు సమాచారం.

రూట్ ఎందుకు మారింది?

ప్రముఖ విశ్లేషకుడు సుమిత్ రిటోలియా ప్రకారం.. ఇది కేవలం యుద్ధ భయం కాదు.. దీని వెనుక పేమెంట్ చిక్కులు ఉన్నాయి. గతంలో ఉన్న 30-60 రోజుల అప్పు సౌకర్యాన్ని పక్కన పెట్టి, ఇరాన్ విక్రేతలు ఇప్పుడు ముందస్తు చెల్లింపులు కోరుతున్నారు. ఈ ఆర్థిక నిబంధనల వల్లే నౌకలు గమ్యస్థానాలను మార్చుకుంటున్నాయని తెలుస్తోంది. ఒకవేళ చెల్లింపుల సమస్య పరిష్కారమైతే, ఆ 6 లక్షల బ్యారెళ్ల చమురు మళ్లీ భారత రిఫైనరీలకే వచ్చే అవకాశం ఉంది. ముడి చమురు ధరలు పెరగకుండా, దేశంలో ఇంధన కొరత రాకుండా భారత ప్రభుత్వం , నౌకాదళం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఒకవైపు యుద్ధం, మరోవైపు కఠినమైన వాణిజ్య నిబంధనల మధ్య భారతీయ నౌకల ప్రయాణం ఇప్పుడు ఒక సాహస యాత్రగా మారింది.

Tags:    

Similar News