China : తగ్గుతున్న జనాభా..పెరుగుతున్న రోబోలు..చైనా రోబోటిక్ సైన్యం చూస్తే ప్రపంచం వణకాల్సిందే
తగ్గుతున్న జనాభా..పెరుగుతున్న రోబోలు..చైనా రోబోటిక్ సైన్యం చూస్తే ప్రపంచం వణకాల్సిందే
China : ప్రపంచ దేశాలను వణికిస్తున్న అతిపెద్ద సమస్య జనాభా తగ్గుదల. ముఖ్యంగా అగ్రరాజ్యం చైనాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జననాల రేటు రికార్డు స్థాయిలో పడిపోతుండటంతో పని చేసే యువత సంఖ్య తగ్గి, ముసలివారి జనాభా పెరిగిపోతోంది. అయితే చైనా మాత్రం ఈ సంక్షోభాన్ని చూసి భయపడటం లేదు. మనుషులు తగ్గితే ఏంటి.. రోబోలతో ప్రపంచాన్ని శాసిస్తామంటూ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగంలో చైనా వేస్తున్న అడుగులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
చైనాలో ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారు మొత్తం జనాభాలో 23 శాతంగా ఉన్నారు. ఈ శతాబ్దం ముగిసే సమయానికి దేశంలో సగం మంది వృద్ధులే ఉంటారని అంచనా. అంటే పని చేసే చేతులు తగ్గి, పెన్షన్ తీసుకునే నోళ్లు పెరుగుతాయన్నమాట. పిల్లల్ని కనడానికి దంపతులకు నగదు ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు ఇచ్చినా పెద్దగా ఫలితం కనిపించలేదు. అందుకే చైనా ప్రభుత్వం తన దృష్టిని 'రోబోల' వైపు మళ్లించింది. మనుషుల కొరతను రోబోలతో భర్తీ చేసి తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలని చూస్తోంది.
సిఎన్ఎన్ నివేదిక ప్రకారం.. చైనా ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక రోబోట్ మార్కెట్‌గా అవతరించింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా తయారైన రోబోలలో సగానికి పైగా చైనాలోనే కొలువుదీరాయి. అక్కడ ఇప్పటికే డార్క్ ఫ్యాక్టరీ మోడల్ ఊపందుకుంది. అంటే లైట్లు కూడా అవసరం లేకుండా, కేవలం యంత్రాలే వస్తువులను తయారు చేస్తాయి. మేడ్ ఇన్ చైనా 2025 పథకం ద్వారా దేశాన్ని హై-టెక్ పవర్ హౌస్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల జనాభా తగ్గినా ఉత్పాదకత మాత్రం తగ్గకుండా జాగ్రత్త పడుతోంది.
చైనా ఆలోచన కేవలం ఫ్యాక్టరీలకే పరిమితం కాలేదు. ఇంటి దగ్గర ముసలివారిని కనిపెట్టుకుని ఉండేందుకు కూడా రోబోలను రంగంలోకి దించుతోంది. మనుషుల్లాగే కనిపించే హ్యూమనాయిడ్ రోబోలు, వృద్ధులకు నడవడానికి సాయపడే మజిల్ సూట్స్, ఎక్సోస్కెలిటన్ వంటి సాంకేతికతపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. AI ఆధారిత కేర్ సిస్టమ్స్ ద్వారా వృద్ధులకు ఆరోగ్య సేవలు అందించేలా ప్లాన్ చేస్తోంది. దీనివల్ల యువత పనిలో నిమగ్నమైనా, ఇంట్లో పెద్దవారికి ఏ ఇబ్బంది కలగకుండా చూడవచ్చని చైనా భావిస్తోంది.
సాంకేతికత ఎంత పెరిగినా కొన్ని సవాళ్లు మాత్రం చైనాను వెంటాడుతున్నాయి. ఆటోమేషన్ వల్ల భవిష్యత్తులో కార్మికుల కొరత తీరవచ్చు కానీ, ప్రస్తుతం ఉన్న యువతకు ఉపాధి దొరకడం కష్టంగా మారుతోంది. చైనా మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో సుమారు 70 శాతం పనులపై AI ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఒకవైపు కార్మికులు దొరకడం లేదని బాధపడుతూనే, మరోవైపు ఉన్నవారికి ఉద్యోగాలు లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఈ సమతుల్యతను చైనా ఎలా కాపాడుకుంటుందో చూడాలి.