Bolivia Plane Crash: కరెన్సీ నోట్లతో వెళ్తున్న విమానం కుప్పకూలింది..
Bolivia Plane Crash: బొలీవియాలో కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తరలిస్తున్న సైనిక విమానం ఎల్ ఆల్టో సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
Bolivia Plane Crash: కరెన్సీ నోట్లతో వెళ్తున్న విమానం కుప్పకూలింది..
దక్షిణ అమెరికా దేశమైన బొలీవియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తరలిస్తున్న సైనిక విమానం రాజధాని లా పాజ్ సమీపంలోని ఎల్ ఆల్టో ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కనీసం 15 మంది మృతిచెందగా, 30 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
బొలీవియా రక్షణ శాఖ మంత్రి మార్కెలో సాలినాస్ తెలిపిన వివరాల ప్రకారం, Lockheed C-130 Hercules సైనిక విమానం శాంటాక్రూజ్ నుంచి కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తీసుకుని ఎల్ ఆల్టో విమానాశ్రయానికి బయల్దేరింది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ల్యాండింగ్ సమయంలో విమానం రన్‌వే దాటి సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లింది.
ఈ క్రమంలో విమానం రోడ్డుపై వెళ్తున్న కనీసం ఐదు వాహనాలను ఢీకొని మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రమాదంలో విమానంలోని సిబ్బందితో పాటు రోడ్డుపై ప్రయాణిస్తున్న సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక ఈ విమానం సెంట్రల్ బ్యాంక్ నుంచి ముద్రించిన కొత్త కరెన్సీ నోట్లను తరలిస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు. ప్రమాదం తర్వాత నేలపై చెల్లాచెదురుగా పడిన కరెన్సీ నోట్లను ప్రజలు ఏరుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
అయితే ఆ నోట్లపై ఇంకా సీరియల్ నంబర్లు ముద్రించలేదని, అందువల్ల అవి ఇంకా చట్టబద్ధమైన కరెన్సీ కాదని సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షుడు డేవిడ్ ఎస్పినోజా స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.