Jaahnavi Kandula Case: జాహ్నవి కందుల కేసులో కీలక మలుపు.. ఆమె కుటుంబానికి రూ. 262 కోట్ల భారీ పరిహారం!
Jaahnavi Kandula Case: అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యానికి బలైపోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి న్యాయం దిశగా కీలక అడుగు పడింది.
Jaahnavi Kandula Case: అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యానికి బలైపోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి న్యాయం దిశగా కీలక అడుగు పడింది. ఆమె మృతికి పరిహారంగా 29 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 262 కోట్లు) చెల్లించేందుకు సియాటెల్ నగరం అంగీకరించింది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి కందుల (23), నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదివేందుకు 2021లో అమెరికా వెళ్లారు. అయితే, 2023 జనవరి 23 రాత్రి సియాటెల్ రోడ్డు దాటుతున్న క్రమంలో, కెవిన్ డవే అనే పోలీసు అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం ఆమెను అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాహ్నవి అక్కడికక్కడే మరణించారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో సదరు పోలీసు అధికారి బాడీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని కలిగించాయి. జాహ్నవి మృతిపై జోకులు వేస్తూ.. "ఆమె ఓ సాధారణ వ్యక్తి, ఈ మరణానికి పెద్దగా విలువ లేదు" అంటూ కెవిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అప్పట్లో భారత ప్రభుత్వం కూడా దీనిపై గట్టిగా స్పందించింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆ అధికారిని విధుల నుంచి తొలగించారు.
"జాహ్నవి మృతి అత్యంత బాధాకరం. ఈ సెటిల్మెంట్ ద్వారా ఆమె కుటుంబానికి కొంతైనా ఊరట లభిస్తుందని ఆశిస్తున్నాం" అని అటార్నీ ఎరికా ఇవాన్స్ పేర్కొన్నారు. గతవారమే ఇరుపక్షాలు కోర్టులో పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన చోట, అధికారి 119 కిలోమీటర్ల వేగంతో వెళ్లడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలింది.