Bangladesh violence: బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోత..మరో హిందువు దారుణ హత్య..!!
Bangladesh violence: బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోత..మరో హిందువు దారుణ హత్య..!!
Bangladesh violence: గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న హింస దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. వరుసగా చోటుచేసుకుంటున్న దాడులు, హత్యలు హిందూ సమాజాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. తీవ్రవాద భావజాలంతో ఉన్న మూకలు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయనే ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం వెలుగులోకి వచ్చిన రాణా ప్రతాప్ బైరాగి హత్య ఘటన మరువకముందే, అదే రోజు రాత్రి మరో హిందూ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
తాజా ఘటనలో నర్సింగ్డి జిల్లాలోని పోలాష్ ఉపజిల్లా చోర్సిందూర్ బజార్ ప్రాంతంలో హిందూ యువకుడు మోని చక్రవర్తిని గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు సమాచారం. ఈ ఘటన జనవరి 5, 2026న రాత్రి సుమారు 10 గంటల సమయంలో జరిగింది. మోని చక్రవర్తి స్థానికంగా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. మార్కెట్ ప్రాంతంలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా దాడి చేసిన దుండగులు పదునైన ఆయుధాలతో అతనిపై విరుచుకుపడ్డారు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన మోనిని ఆసుపత్రికి తరలించేలోపే అతను ప్రాణాలు కోల్పోయాడు. మోని, మదన్ చక్రవర్తి పెద్ద కుమారుడిగా గుర్తించారు.
రాణా ప్రతాప్ బైరాగి హత్య జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే మరో హిందూ యువకుడు చంపబడటం పరిస్థితి తీవ్రతను మరింత స్పష్టంగా చూపిస్తోంది. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై జరుగుతున్న హింసాత్మక ఘటనల జాబితా పెరుగుతూనే ఉంది. గతంలో దీపు చంద్ర దాస్ అనే హిందూ ఫ్యాక్టరీ కార్మికుడిని ఒక మూక కొట్టి చంపింది. అమృత్ మండల్ అనే యువకుడు కూడా దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. మైమెన్‌సింగ్ జిల్లాలో బజేంద్ర బిశ్వాస్ అనే హిందూ యువకుడిని అతని తోటి గార్డు కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మరో ఘటనలో హిందూ వ్యాపారవేత్త ఖోకన్ దాస్‌పై జరిగిన దాడి అతని మృతికి దారి తీసింది. ఈ వరుస ఘటనలతో మూడు వారాల వ్యవధిలో హిందూ యువకుడి హత్యకు గురైన ఆరవ ఘటనగా మోని చక్రవర్తి హత్య నమోదైంది.
ఇవే కాకుండా, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్‌లోని జెనైదా జిల్లాలోని కాలిగంజ్ ప్రాంతంలో ఒక హిందూ వితంతువుపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులు ఆమె బంధువులను ఒక గదిలో బంధించి, ఆ మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడి అనంతరం ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టి, జుట్టును నరికివేసినట్లు సమాచారం. ఈ దారుణ ఘటనను నిందితుల్లో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం మరింత కలచివేసే అంశంగా మారింది.
ఈ ఘటన తర్వాత తీవ్రంగా గాయపడిన ఆ మహిళ స్పృహ కోల్పోయిన స్థితిలో ఉండగా, స్థానికులు ఆమెను సదర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె నిందితుడు షాహీన్‌తో పాటు అతని సహచరుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వరుస హత్యలు, దాడులు, మహిళలపై అఘాయిత్యాలతో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల భద్రతపై తీవ్ర సందేహాలు తలెత్తుతున్నాయి. రాణా ప్రతాప్ బైరాగి, మోని చక్రవర్తి హత్యలు కేవలం వ్యక్తిగత నేరాలుగా కాకుండా, ఒక సమాజం మొత్తం భయాందోళనలోకి నెట్టబడుతున్న పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఘటనలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది, హిందూ మైనారిటీలకు భద్రత కల్పించే దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది.