Iran Israel War : మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు.. స్టార్ ప్లేయర్లు, నటీనటుల ప్రాణాలు ఇప్పుడు గాలిలో దీపమేనా?
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు.. స్టార్ ప్లేయర్లు, నటీనటుల ప్రాణాలు ఇప్పుడు గాలిలో దీపమేనా?
Iran Israel War : మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ విరుచుకుపడుతోంది. గల్ఫ్ ప్రాంతంలోని ఎనిమిది దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఈ భీకర దాడుల ప్రభావం సామాన్య పౌరులపైనే కాకుండా అంతర్జాతీయ విమానయానంపై కూడా తీవ్రంగా పడింది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1 వరకు పలు గల్ఫ్ దేశాలు తమ గగనతలాన్ని మూసివేసాయి. దీనివల్ల ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తో పాటు అబుదాబి విమానాశ్రయాల్లో వేలాది విమానాలు రద్దయ్యాయి. ఫలితంగా సామాన్య పర్యాటకులతో పాటు ప్రపంచ స్థాయి సెలబ్రిటీలు కూడా యూఏఈలో చిక్కుకుపోయారు.
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఒలింపిక్ పతక విజేత పి.వి.సింధు దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోవడం క్రీడా వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. దుబాయ్ మీదుగా బర్మింగ్‌హామ్ వెళ్లాల్సిన ఆమె విమానం రద్దు కావడంతో విమానాశ్రయానికే పరిమితమయ్యారు. అలాగే దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వచ్చిన ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ డానిల్ మెద్వెదేవ్ సహా పలువురు అగ్రశ్రేణి టెన్నిస్ తారలు టోర్నీ ముగిసినా స్వదేశాలకు వెళ్లలేక అక్కడే ఆగిపోయారు. బ్రిటిష్ బాక్సర్ అమీర్ ఖాన్, ఫుట్‌బాల్ స్టార్ రియో ఫెర్డినాండ్ తన భార్యతో కలిసి సెలవుల కోసం దుబాయ్ వచ్చి ఈ యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నారు.
వినోద రంగంపై కూడా ఈ యుద్ధ సెగ గట్టిగానే తగిలింది. బాలీవుడ్ నటి సోనాల్ చౌహాన్ తాను దుబాయ్‌లో చిక్కుకుపోయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తమను ఆదుకోవాలని ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ రియాలిటీ టీవీ స్టార్ విక్కీ ప్యాటిసన్ తన హనీమూన్ కోసం దుబాయ్ వచ్చి ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్నారు. లవ్ ఐలాండ్ స్టార్ లారా ఆండర్సన్ అక్కడి పరిస్థితిని వివరిస్తూ.. క్షిపణి దాడుల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపడం చాలా భయంకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం యూఏఈ ప్రభుత్వం, భారత్ సహా వివిధ దేశాల రాయబార కార్యాలయాలు రంగంలోకి దిగాయి. ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకున్న ప్రయాణికులకు ఆహారం, వసతి కల్పించడంతో పాటు వారిని సురక్షితంగా స్వదేశాలకు పంపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. గగనతలం ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియని అనిశ్చితి నెలకొనడంతో ప్రయాణికుల్లో టెన్షన్ పెరుగుతోంది. యుద్ధం మరింత ముదిరితే పరిస్థితి ఇంకెంత దారుణంగా మారుతుందోనని ప్రపంచం ఆందోళన చెందుతోంది.