China New Year 2025: చైనాకు ఇవాళే ఎందుకు స్పెషల్ డే.. అక్కడ కూడా ఉగాది, దీపావళి లాంటి పండగలు ఉన్నాయా?
China New Year 2025: చైనాకు ఈరోజు ఎంతో స్పెషల్... చైనాలోనూ దీపావళి పండగ చేసుకుంటారు తెలుసా? చైనాలో కొత్త సంవత్సరం వేడుకలకు వేళయింది. ఆ డీటేయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
China New Year 2025: చైనాలో ఇవాళే కొత్త సంవత్సరం.. ఎందుకంటే...
Chinese New Year 2025 Date: ఇవాళ జనవరి 29... ప్రపంచ దేశాలకు అన్ని తేదీల తరహాలోనే ఇది కూడా ఒక రోజు. కానీ చైనాకు మాత్రం ఈరోజు చాలా ప్రత్యేకం. ఎందుకంటే చైనాలో ఇవాళే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈరోజు నుండి చైనాలో శిశిర ఋతువు ముగిసిన వసంత ఋతువు మొదలవుతుంది. చల్లటి వాతావరణానికి చైనా బైబై చెప్పి వేసవి కాలాని కంటే ముందుగా వచ్చే ఆహ్లాదకరమైన వాతావరణంలోకి అడుగిడుతుంది. ఈ సందర్భంగా చైనాలో 15 రోజుల పాటు పండగ లాంటి వాతావరణం ఉంటుంది. ఒక్క చైనాలోనే కాదు... ప్రపంచదేశాల్లో చైనీయులు ఎక్కడెక్కడ ఉన్నారో, వారు ఈరోజు చైనా న్యూ ఇయర్ ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసుకుంటారు.
జనవరి 1 ఇంగ్లీష్ న్యూ ఇయర్ తరహాలో చైనా న్యూ ఇయర్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. చంద్రమానం, తిథులను అనుసరిస్తూ జనవరి 21 నుండి ఫిబ్రవరి 20వ తేదీ మధ్య ఉంటుంది. గతేడాది ఫిబ్రవరి 10వ తేదీన వచ్చిన చైనా న్యూ ఇయర్ ఫెస్టివల్... ఈసారి జనవరి 29న వచ్చింది.
చైనాలో దీపావళి పండగ
ఫిబ్రవరి 12న చైనాలో లాంతర్ ఫెస్టివల్ జరుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఇది చైనాలో ఆ దేశ సంప్రదాయం ప్రకారం దీపావళి పండగ అన్నమాట. ఈ పండగతోనే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముగుస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పేరుతో కొత్త తెలుగు సంవత్సరాన్ని వేడుకగా జరుపుకుంటాం. అలాగే మొత్తం ఇండియాలో గుడి పడ్వ పేరుతో హిందువులు కొత్త సంవత్సరాన్ని సేలబ్రేట్ చేసుకుంటారు. అదే తరహాలో ఇది చైనా వాళ్లకు కొత్త సంవత్సరం పండగ అన్నమాట.
2024 ఉగాది నుండి మొదలైన కొత్త సంవత్సరాన్ని శ్రీ క్రోధినామ సంవత్సరం అని పిలుచుకుంటున్నాం. అలాగే ఈ 2025 ఉగాది నుండి కొత్తగా మొదలయ్యే ఏడాదిని విశ్వావసు సంవత్సరంగా పిలువబోతున్నాం. మనకు ఈ పేర్లు ఎలాగైతే ఉన్నాయో చైనా వారికి కూడా అలాగే ప్రతీ కొత్త సంవత్సరానికి ఓ పేరు ఉంటుంది. అది కూడా ప్రతీ 60 ఏళ్లకు ఒకసారి రిపీట్ అవుతుంది.
ఈ ఏడాదిని వారు ఉడ్ స్నేక్ ఇయర్‌గా పిలుచుకుంటున్నారు. ఇదే పేరుతో 1965 లో చివరిసారిగా వారు కొత్త చైనా సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
చైనాతోపాటు తైవాన్, హాంగ్ కాంగ్, సింగపూర్, వియత్నాం, కొరియా దేశాల్లోనూ ఇదే తరహాలో కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకునే సంస్కృతి కనిపిస్తుంటుంది. కుటుంబంలోని అందరూ, అలాగే బంధుమిత్రులు అందరూ కలిసి హాయిగా ఈ పండగ ఎంజాయ్ చేస్తారు. వీధుల్లో అందరూ ఒక్కచోట చేరి లయన్ డ్యాన్స్, డ్రాగాన్ డ్యాన్స్ చేసి మురిసిపోతారు.
రెడ్ కలర్‌లో ఉన్న గిఫ్ట్ కవర్లలో డబ్బులు పెట్టి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వారు పరస్పరం కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. రాత్రయితే చాలు ఇల్లు, వాకిలి దీపాలతో వెలిగిపోతుంది. మిరుమిట్లుగొలిపే టపాసులతో ఆకాశం కొత్త వెలుగులతో నిండిపోతుంది. ఈ దీపాల వెలుగులో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాం అనేది చైనీయుల విశ్వాసం.