US-Iran War: ట్రంప్ 48 గంటల డెడ్ లైన్:..ఇరాన్ విద్యుత్ కేంద్రాలే లక్ష్యం.. ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోంది..!
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 48 గంటల గడువు విధించారు.
US-Iran War: ట్రంప్ 48 గంటల డెడ్ లైన్:..ఇరాన్ విద్యుత్ కేంద్రాలే లక్ష్యం.. ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోంది..!
Donald Trump : ప్రపంచ పటంపై మరో భీకర యుద్ధం ముంచుకొస్తోంది. అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ దేశం ఇరాన్ మధ్య మాటల యుద్ధం కాస్తా ఇప్పుడు బాంబుల వర్షంగా మారేలా కనిపిస్తోంది. సరిగ్గా 48 గంటల గడువు.. ఈ లోపు ఇరాన్ తన పట్టు వీడకపోతే ఇంధన కేంద్రాలే లక్ష్యంగా విరుచుకుపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన హెచ్చరికతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో కఠిన హెచ్చరిక జారీ చేశారు.
ఈ క్షణం నుండి 48 గంటలలోపు ఇరాన్ ఎటువంటి బెదిరింపు లేకుండా హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే.. అమెరికా బలగాలు ఇరాన్‌లోని అతిపెద్ద విద్యుత్ కేంద్రాలపై దాడులు చేసి వాటిని నాశనం చేస్తాయి అని ప్రకటించారు. అయితే, ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదు. ట్రంప్ హెచ్చరికలకు ప్రతిస్పందనగా, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ అమెరికా గనుక తమ మౌలిక సదుపాయాలను తాకితే, పశ్చిమాసియాలోని కీలక సౌకర్యాలు కోలుకోలేని విధంగా ధ్వంసమవుతాయని హెచ్చరించారు. అంతేకాదు, అమెరికాకు సహకరించే దేశాల్లోని ఇంధన కేంద్రాలు కూడా తమకు చట్టబద్ధమైన లక్ష్యాలేనని ఇరాన్ సైన్యం కుండబద్ధలు కొట్టింది.
ప్రపంచానికి ఊపిరితిత్తుగా హోర్ముజ్ జలసంధి
ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో అత్యంత కీలకమైన మార్గం హోర్ముజ్ జలసంధి. ఫిబ్రవరి 28 నుండి ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేసింది. మా ధ్వంసమైన విద్యుత్ ప్లాంట్లను పునర్నిర్మించే వరకు ఈ మార్గాన్ని తెరిచే ప్రసక్తే లేదు అని ఇరాన్ భీష్మించుకుని కూర్చుంది. దీనివల్ల ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోయి, ప్రపంచ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
యుద్ధ క్షేత్రంలో ఏం జరుగుతోంది?
గత కొన్ని రోజులుగా ఇరు పక్షాల మధ్య దాడులు తీవ్రమయ్యాయి.యుద్ధం మొదలైనప్పటి నుండి ఇరాన్ సుమారు 400 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా, అందులో 92 శాతం ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది.అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్‌లో 81,000 ఇళ్లు దెబ్బతిన్నాయని రెడ్ క్రెసెంట్ పేర్కొంది. ఇటు ఇజ్రాయెల్‌లో కూడా వేల సంఖ్యలో ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా గ్రూప్ టెల్ అవీవ్‌పై రాకెట్ దాడులు చేస్తూ యుద్ధాన్ని మరింత క్లిష్టంగా మారుస్తోంది. ఈ యుద్ధ సెగ సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 119 డాలర్లకు చేరి, ప్రస్తుతం 110 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు వెళ్లే ప్రమాదం ఉంది.