Iran America War: ఇరాన్‌తో శాంతి చర్చలకు ట్రంప్ బృందం ప్రయత్నం
Iran America War: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బృందం ఇరాన్‌తో కాల్పుల విరమణ కోసం ప్రయత్నిస్తోంది. అయితే నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.
Iran America War
Iran America War: ఇరాన్ తో అమెరికా.. ఇజ్రాయేల్ యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. ఇరాన్ ను ఉఫ్ మని ఊదేస్తాం అంటూ యుద్ధం మొదలు పెట్టిన అమెరికా.. 24 రోజులు గడిచిపోయినా ఇరాన్ ను లొంగదీసుకోలేకపోయింది. యుద్ధం ప్రకటించిన వెంటనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా ముఖ్యమైన నాయకుల్ని మట్టుబెట్టి పట్టు సాధించామనుకున్న అమెరికా, ఇజ్రాయేల్ లకు ఆ తరువాత నుంచి అసలు సినిమా చూపించడం మొదలు పెట్టింది ఇరాన్. యుద్ధం అంటూ వస్తే చివరివరకూ పోరాడతాం అంటూ ఇరాన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. హార్మూజ్ జలసంధిని దిగ్బంధించి ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది ఇరాన్. గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తూ వారికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో యుద్ధం ఆపాలనే ప్రయత్నాలు పలు దేశాలు మొదలు పెట్టాయి. ఇప్పటికే ఇరాన్ తో సంప్రదింపులు జరిపిన కొన్ని దేశాలు ఇరాన్ డిమాండ్స్ తో వెనక్కి తగ్గాయి. కానీ, పరిస్థితి మరింత ముదురుతుండడంతో మళ్ళీ అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరగాలని ఇటు గల్ఫ్ దేశాలతో పాటు.. అటు యూరోపియన్ యూనియన్ కూడా డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ బృందం ఇరాన్‌తో కాల్పుల విరమణ కోసం చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. యాక్సియోస్ న్యూస్ ప్రకారం, ట్రంప్ సలహాదారులు జారెడ్ కుష్నర్,స్టీవ్ విట్కాఫ్ ఈ ప్రయత్నంలో పాలుపంచుకుంటున్నారు.
ఇరాన్ షరతులివే..
అయితే, ఇరాన్ చర్చలకు గతంలోనే కొన్ని షరతులు విధించింది. అందులో మొదటిది యుద్ధాన్ని నిలిపివేయడం. రెండోది తమ నష్టాలకు పరిహారం చెల్లించడం. మూడోది భవిష్యత్తులో తమపై మళ్లీ దాడి జరగదని గట్టి హామీ ఇవ్వాలి. ఈ మూడు ప్రధాన డిమాండ్లకు అమెరికా ఒప్పుకుంటేనే చర్చలకు వస్తామని గట్టిగా చెబుతోంది.
అమెరికా ఏమంటోంది?
మరోవైపు, ఇరాన్ షరతులన్నింటినీ, ముఖ్యంగా నష్టపరిహారం డిమాండ్‌ను అంగీకరించడానికి తాను ఇంకా సిద్ధంగా లేనని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్‌ల మధ్య ప్రత్యక్ష చర్చలు జరగడం లేదు. అయితే, ఈజిప్ట్, ఖతార్, బ్రిటన్ వంటి దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి. ట్రంప్ ఒక మెట్టు దిగివస్తే చర్చలు సాధ్యమే అని ఈ దేశాలు నమ్ముతున్నాయి. అయితే, అమెరికా కూడా చర్చల కోసం కొన్ని షరతులను పెడుతోంది. ఇరాన్ తన క్షిపణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని, యురేనియం శుద్ధిచేసే పనులను ఆపాలని, తన అణు కర్మాగారాలను కూల్చివేయాలని అమెరికా కోరుతోంది. అంతేకాకుండా, ఇరాన్ హిజ్బుల్లా - హమాస్‌లకు నిధులు ఇవ్వడంఆపాలని కూడా డిమాండ్ చేస్తోంది.
బ్రిక్స్ కలుగజేసుకోవాలి..
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పజకియన్ శనివారం ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన, ఇరాన్‌పై దాడులను నివారించడంలో బ్రిక్స్ పాత్ర పోషించాలని అన్నారు.
బ్రిక్స్ ఎలాంటి ఒత్తిడి లేకుండా సొంతంగా పనిచేసి, ఈ విషయంలో ముందుకు రావాలని ఆయన అన్నారు. అంతేకాకుండా, మధ్యప్రాచ్య దేశాలు సంయుక్తంగా ఒక కొత్త భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఇరాన్ అధ్యక్షుడు సూచించారు. ఇది ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడటంతో పాటు బయటి దేశాల జోక్యాన్ని కూడా తగ్గిస్తుందన్నారు.
మొత్తమ్మీద యుద్ధం తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో రాజీ కోసం చర్చల ప్రతిపాదనలు తెరమీదకు రావడం.. కొన్ని దేశాలు ఇందుకోసం ప్రయత్నాలు చేయడం శుభసంకేతాలుగానే భావించాలి. ఇప్పటివరకూ ఎక్కడా యుద్ధం విషయంలో మాట్లాడని దేశాలు ఇప్పుడు చర్చలు జరగాలని కోరుకోవడం మంచి పరిణామమే అని చెప్పొచ్చు.