పెళ్లి చేసుకుంటేనే ఉద్యోగం... లేదంటే తీసేస్తామని కంపెనీ నోటీసులు... వైరల్ అవుతున్న కంపెనీ వివాదాస్పద నిర్ణయం
Single employees threatened to get married: ఒక కంపెనీ తమ సంస్థలో పనిచేసే బ్యాచిలర్స్‌కు ఓ వింత షరతు పెట్టింది. అదేంటంటే... ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరుకల్లా తమ సంస్థలో పనిచేసే సిబ్బంది ఎవ్వరూ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండకూడదు. 28 ఏళ్ల నుండి 58 ఏళ్ల మధ్య వయస్సున్న వారిలో ఏ ఒక్కరూ ఒంటరిగా ఉండకుండా పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో కొత్త జీవితం ప్రారంభించాలి. లేదంటే వారిని ఉద్యోగంలోంచి తొలగిస్తామని ఆ కంపెనీ స్పష్టంచేసింది. ఆల్రెడీ పెళ్లయిన వారికి ఈ వింత రూల్ వర్తించదు. కానీ పెళ్లి కాని వారికి లేదా పెళ్లయి విడాకులు తీసుకున్న ప్రతీ ఒక్కరికీ ఈ రూల్ వర్తిస్తుందిని ఆ కంపెనీ తేల్చి చెప్పింది.
ఒకవేళ ఈ ఏడాది మార్చి నెల ఆఖరు నాటికి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే.. వారు కంపెనీకి ఒక లెటర్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. జూన్ చివరి నాటికి కూడా వారికి పెళ్లి కాకపోతే... అప్పుడు కంపెనీ వారి పరిస్థితిని సమీక్షించి సెప్టెంబర్ తరువాత వారిని ఉద్యోగంలో కొనసాగించాలా లేక తొలగించాలా అనేది నిర్ణయిస్తుందని ఆ నోటీసుల్లో రాసి ఉంది.
కంపెనీలు ఇలాంటి వింత కండిషన్స్ పెడితే ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకునేందుకు సంబంధం దొరకొద్దా అని టెన్షన్ పడుతున్నారా? అయితే, అలా కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ కండిషన్ పెట్టింది ఇండియన్ కంపెనీ కాదు... చైనాలోని షాండాన్ షంటియన్ కెమికల్ గ్రూప్ కంపెనీ వారు ఈ వింత ఫిట్టింగ్ పెట్టారు. ఇప్పటికే ఆ కంపెనీలో పనిచేసే 1200 మంది ఉద్యోగులకు నోటీసులు వెళ్లాయి.
సోషల్ మీడియాలో కంపెనీ నోటీసులు వైరల్ అయ్యాయి. ఆ నోటీసులు చూసిన నెటిజెన్స్ కంపెనీ తీరుపై మండిపడుతున్నారు. ఇది కార్మిక చట్టాలకు విరుద్ధం అవుతుందని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలతో కంపెనీకి ఏం సంబంధం అని ఇంకొందరు నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో నోటీసులు వైరల్ అవడంతో ఈ వివాదం కాస్త చైనా ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. చైనా లోకల్ హ్యూమన్ రిసోర్సెస్, సోషల్ సెక్యురిటీ బ్యూరో సదరు కంపెనీకి నోటీసులు జారీచేశాయి. సోషల్ మీడియాలో ప్రతికూల స్పందన రావడంతో పాటు ప్రభుత్వం నుండి నోటీసులు కూడా రావడంతో ఆ కంపెనీ ఈ విషయంలో వెనక్కు తగ్గింది. ఉద్యోగులకు జారీచేసిన నోటీసులను నిలిపేసింది. కంపెనీలో పనిచేసే సిబ్బంది పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయితే బాగుంటుందనేదే కంపెనీ అభిప్రాయమని కంపెనీ ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారు.