China - Taiwan Conflict: చైనా - తైవాన్ మధ్య ముదురుతున్న వివాదం

China - Taiwan Conflict: *యుద్ధ విమానాలతో కవ్వింపులు *దక్షిణ చైనా సముద్రంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు

Update: 2021-10-07 08:45 GMT

తైవాన్‌ను కబళించేందుకు డ్రాగన్‌ కుట్ర(ఫైల్ ఫోటో)

China - Taiwan Conflict: స్వయంపాలిత దీవి తైవాన్‌పై ఆధిపత్యం చెలాయించి, తన దారికి తెచ్చుకోడానికి చైనా దూకుడును మరింత పెంచింది. వరుసగా నాలుగు రోజుల నుంచి భారీగా యుద్ధ విమానాలను పంపుతూ భయభ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో చైనా సముద్రంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

కొన్ని రోజులుగా యుద్ధ విమానాలు తమ గగనతలంలో చక్కర్లు కొట్టినట్టు తైవాన్‌ రక్షణశాఖ వెల్లడించింది. ఇది యుద్ధ సన్నాహకాల్లో భాగం కావొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2025లోపు చైనా తమపై దండయాత్ర చేయడం ఖాయమంటూ తైవాన్‌ రక్షణ మంత్రి ఛై-కూ ఛెంగ్‌ తాజాగా పార్లమెంట్‌ వేదికగా ఆందోళన వ్యక్తం చేయడం.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.

'ఫస్ట్ ఐలాండ్ చైన్‌'గా వ్యవహరించే ప్రదేశంలో తైవాన్ ఉంది. ఆ ప్రదేశంలోనే ఉన్న జపాన్, ఫిలిప్పీన్స్, వియత్నాంలకు అమెరికాతో బలమైన సంబంధాలు ఉన్నాయి. తైవాన్‌లో సెమీకండక్టర్ పరిశ్రమ ఉంది. దీనిపై అమెరికాతో పాటు 'ఫస్ట్ ఐలాండ్ చైన్' దేశాలు ఎక్కువగా ఆధారపడుతున్నాయి. మరోవైపు తైవాన్ ఆయుధాల్లో అత్యధికం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నవే. తైవాన్‌ను ఆక్రమిస్తే.. అమెరికా సాంకేతికతతో చేసిన ఆయుధాలన్నీ చైనా వశమవుతాయి.

దీంతో అమెరికాను వెనక్కి నెట్టి సూపర్ పవర్‌గా పూర్తిస్థాయి గుర్తింపు తెచ్చుకునేందుకు చైనా ఆరాటపడుతోంది. ఈ విషయాలన్నీ ఆగ్రరాజ్యం అమెరికాకు బాగా తెలుసు. అందుకే చైనా దూకుడుకు అమెరికా కల్లెం వేస్తుందని తైవాన్‌ భావిస్తోంది. మరోవైపు తైవాన్‌పై దండయాత్ర నివారణ చట్టాన్ని అగ్రరాజ్యం ఇప్పటికే ఆమోదించింది.

ట్రంప్ హయంలో తైవాన్‌ జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక దశలో హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక మాత్రం అగ్రరాజ్యం దూకుడు తగ్గిందనే చెప్పొచ్చు. చైనా యుద్ధవిమానాల చొరబాట్లపై తాజాగా బైడెన్ స్పందించారు. తాను.. షి జిన్‌పింగ్‌తో మాట్లాడానని.. తైవాన్ ఒప్పందానికి కట్టుబడి ఉండేందుకు తాము అంగీకరించినట్లు చెప్పారు.

దాన్ని ఉల్లంఘించి చైనా ముందుకెళ్తుందని అనుకోవట్లేదని తెలిపారు. ఇదిలా ఉంటే అమెరికా సైన్యంలోని ఉన్నతాధికారులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2027 కల్లా తైవాన్‌ను ఆక్రమించాలని చైనా లక్ష్యం విధించుకుందని ఇటీవల అమెరికా సైనిక ఉన్నతాధికారి ఒకరు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది.

మరోవైపు భారత్‌లో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమను నెలకొల్పడంపై తైవాన్‌తో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే భారత్‌లో 50వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే అవకాశముంది. ఈ ఒప్పందం చైనాకు ఏమాత్రం ఇష్టం లేదు.

తాజాగా తైవాన్ గగనతలంలోకి డ్రాగన్ యుద్ధ విమానాల చొరబాట్లు పెరగడానికి ఇదీ ఓ కారణమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా - చైనా మధ్య ఉద్రిక్తతలు మున్ముందు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News