Iran warning: పొరుగు దేశాలకూ హెచ్చరిక.. గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు: అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్..!!
Iran warning: పొరుగు దేశాలకూ హెచ్చరిక.. గల్ఫ్‌లో యుద్ధ మేఘాలు: అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్..!!
Iran warning: అమెరికా సైనిక చర్యలకు సహకరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ ఇరాన్ పొరుగు దేశాలకు కఠిన హెచ్చరికలు జారీ చేసింది. తమ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా పదే పదే జోక్యం చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్, ఇకపై సహనం చూపబోమని స్పష్టం చేసింది. అమెరికా దాడికి దిగితే దానికి మించిన ప్రతిచర్య ఉంటుందని ప్రకటించిన ఇరాన్, అదే సమయంలో అమెరికా దళాలకు మద్దతిచ్చే దేశాల్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా మారతాయని తేల్చి చెప్పింది.
ఇరాన్‌కు సమీప ప్రాంతాల్లో అమెరికా అధునాతన డ్రోన్లతో విస్తృత నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొనడంతో ఇరాన్‌తో పాటు గల్ఫ్ ప్రాంతమంతా అప్రమత్తతలో ఉంది. తమపై దాడికి ప్రయత్నిస్తే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇరాన్ మరోసారి హెచ్చరిస్తోంది.
ఇదిలా ఉండగా, ఇటీవల వరకూ వెనిజువెలా పరిణామాలపై దృష్టి కేంద్రీకరించిన అమెరికా, ఇప్పుడు తన వ్యూహాత్మక బలగాల దృష్టిని మళ్లీ మధ్యప్రాచ్య ప్రాంతం వైపు మళ్లించినట్టు సమాచారం. తాజా నివేదికల ప్రకారం, ఒమన్ గల్ఫ్‌తో పాటు ఇరాన్ సరిహద్దు ప్రాంతాల్లో అమెరికా నిఘా కార్యకలాపాలను గణనీయంగా పెంచింది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో సైనిక చర్యలకు దారితీయవచ్చన్న అంచనాలను అంతర్జాతీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచే అమెరికా నావికాదళానికి చెందిన అత్యాధునిక ఎంఎక్వీ–4సీ ట్రైటాన్ డ్రోన్లు అబుదాబి కేంద్రంగా నిరంతర గస్తీ నిర్వహిస్తున్నాయి. ఈ డ్రోన్ నిఘా వ్యవస్థలతో ఇరాన్ కదలికలపై కళ్లెత్తి చూస్తున్న అమెరికా చర్యలు, గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం ఎటు దారి తీస్తుందన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.