Insomnia Tips: పడకపై పడగానే నిద్ర రావట్లేదా? ఈ 5 చిట్కాలు పాటిస్తే నిమిషాల్లో గుర్రు పెట్టి నిద్రపోతారు!
రాత్రిళ్లు నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? మానసిక ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ 5 చిట్కాలు పాటిస్తే మీ నిద్రలేమి సమస్య తీరుతుంది. వ్యాయామం, ఆహారం మరియు డిజిటల్ అలవాట్లలో మార్పుల గురించి ఇక్కడ తెలుసుకోండి.
రోజంతా కష్టపడి పని చేసి, రాత్రి హాయిగా నిద్రపోదామని పడకపై చేరగానే వేల ఆలోచనలు చుట్టుముడుతున్నాయా? గంటల తరబడి అటు ఇటు దొర్లుతూ నిద్ర కోసం పోరాడుతున్నారా? అయితే మీరు 'నిద్రలేమి' (Insomnia) సమస్యతో బాధపడుతున్నట్లే. నిద్ర సరిగ్గా లేకపోతే మానసిక ఒత్తిడి పెరగడమే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి బయటపడి హాయిగా నిద్రపోవడానికి ప్రముఖ మానసిక ఆరోగ్య నిపుణురాలు ఆనందిత వాఘని సూచించిన 5 అద్భుతమైన మార్గాలివే..
1. వర్కౌట్ టైమింగ్ మార్చండి
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడిని కలిగించే 'కార్టిసాల్' తగ్గి, నిద్రను ప్రేరేపించే 'మెలటోనిన్' హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. అయితే, నిద్రకు కనీసం 3-4 గంటల ముందే వ్యాయామాన్ని పూర్తి చేయాలి. పడుకునే ముందు హెవీ వర్కౌట్లు చేస్తే శరీరం మరింత ఉత్సాహంగా మారి నిద్రను దూరం చేస్తుంది.
2. మంచం మీదే ఆఫీసు పనులా? వద్దు!
మన మెదడు అలవాట్లను బట్టి రియాక్ట్ అవుతుంది. మీరు మంచం మీద కూర్చుని ఆఫీసు పని చేయడం, ల్యాప్‌టాప్ వాడటం లేదా ఫోన్ స్క్రోల్ చేయడం చేస్తే.. పడకపై చేరగానే మెదడు 'అలర్ట్' మోడ్‌లోకి వెళ్తుంది. అందుకే మంచాన్ని కేవలం నిద్రకు మాత్రమే పరిమితం చేయండి. పడుకున్న 20 నిమిషాల వరకు నిద్ర రాకపోతే, బలవంతంగా పడుకోకుండా మంచం దిగి పుస్తకం చదవడం వంటివి చేయండి.
3. 'డిజిటల్ డిటాక్స్' తప్పనిసరి
నిద్రపోవడానికి మెదడుకు ఆన్/ఆఫ్ స్విచ్ ఉండదు. అందుకే నిద్రకు కనీసం 30-45 నిమిషాల ముందే ఫోన్లు, లాప్‌టాప్‌లకు దూరంగా ఉండాలి. గదిలో వెలుతురు తగ్గించి, ప్రశాంతమైన మ్యూజిక్ వినడం లేదా డైరీ రాయడం వంటివి చేస్తే.. శరీరం విశ్రాంతికి సిద్ధమవుతుంది.
4. ఆహార నియమాలు ముఖ్యం
రాత్రిపూట తీసుకునే ఆహారం నిద్ర నాణ్యతను నిర్ణయిస్తుంది.
నిద్రకు ముందు కెఫీన్ (కాఫీ, టీ), చాక్లెట్లకు దూరంగా ఉండాలి.
రాత్రి భోజనం తేలికగా ఉండాలి.
మద్యం నిద్రను రప్పిస్తుందని అనుకోవడం తప్పు; అది గాఢ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ఆకలిగా అనిపిస్తే వేడి పాలు లేదా అరటిపండు తీసుకోవడం ఉత్తమం.
5. ఆలోచనలను పేపర్ మీద పెట్టండి
రేపటి పనుల గురించిన టెన్షన్ మిమ్మల్ని నిద్రపోనివ్వకపోతే, వాటిని ఒక పేపర్ మీద 'టు-డూ లిస్ట్' లాగా రాసి పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ మెదడు ఆ సమస్యల గురించి ఆలోచించడం ఆపేసి, "ఈ పని రేపు చూసుకోవచ్చు" అనే సంకేతాన్ని అందుకుని ప్రశాంతంగా నిద్రపోవడానికి సహకరిస్తుంది.
ఈ సింపుల్ అలవాట్లను మీ జీవనశైలిలో భాగం చేసుకుంటే, నిద్రలేమి సమస్య మాయమై మీరు ప్రతిరోజూ ఉత్సాహంగా నిద్రలేస్తారు.