Kala Namak Rice: బుద్ధుడు మెచ్చిన అద్భుత బియ్యం.. డయాబెటిస్, గుండె జబ్బులకు చెక్ పెట్టే సూపర్ ఫుడ్!
ఉత్తర ప్రదేశ్‌లో పండే కాలా నమక్ లేదా 'బుద్ధ రైస్' యొక్క అద్భుత ప్రయోజనాలు. రక్తహీనత, గుండె జబ్బులు మరియు డయాబెటిస్ నివారణలో ఈ బియ్యం ఎలా పనిచేస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
ప్రస్తుతం సమాజంలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతోంది. ఈ క్రమంలోనే మనం తినే ఆహారంలో 'సూపర్ ఫుడ్స్' (Super Foods) కు ప్రాధాన్యత ఇస్తున్నాం. అటువంటి వాటిలో ఉత్తర ప్రదేశ్‌లో పండే 'కాలా నమక్' (Kala Namak Rice) బియ్యం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అద్భుతమైన సువాసన, అంతకు మించిన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ బియ్యాన్ని నిపుణులు 'న్యూట్రిషనల్ సూపర్ ఫుడ్'గా అభివర్ణిస్తున్నారు.
2,600 ఏళ్ల చరిత్ర.. బుద్ధుడి వారసత్వం
ఈ బియ్యానికి సామాన్యమైన చరిత్ర లేదు. దాదాపు 2,600 ఏళ్ల క్రితం గౌతమ బుద్ధుడి తండ్రి శుద్ధోదన మహారాజు పాలించిన కపిలవస్తు (నేటి సిద్ధార్థనగర్) ప్రాంతంలో దీనిని సాగు చేసేవారు. అందుకే దీనిని ‘బుద్ధ బియ్యం’ (Buddha Rice) అని కూడా పిలుస్తారు.
నల్లటి పొట్టును కలిగి ఉండే ఈ బియ్యం గింజలు, ఉడికించిన తర్వాత తెల్లగా, పొడవుగా మారి అద్భుతమైన సువాసనను వెదజల్లుతాయి. పురావస్తు శాఖ తవ్వకాల్లోనూ ఈ బియ్యం ఆనవాళ్లు లభించడం దీని ప్రాచీనతకు నిదర్శనం.
పోషకాల గని: ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రముఖ ఆరోగ్య నిపుణులు డాక్టర్ మేఘనా పాసి వివరించిన ప్రకారం.. కాలా నమక్ బియ్యంలో సాధారణ బియ్యం కంటే ఐరన్, జింక్ మరియు ప్రొటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి.
రక్తహీనతకు చెక్: ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల అనీమియా (రక్తహీనత)తో బాధపడేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.
గుండె ఆరోగ్యం: ఇందులో ఉండే 'ఆంథోసైనిన్స్' వంటి శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చూస్తాయి. తద్వారా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.
డయాబెటిస్ రోగులకు వరం: ఈ బియ్యం గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
చర్మ సౌందర్యం: ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుగుపరచడమే కాకుండా, వయస్సు పెరగడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి.
ఒకప్పుడు మన పూర్వీకులు వాడిన ఈ సంప్రదాయ బియ్యాన్ని మళ్లీ మన డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.