Betul Violence : ఆవుపై లైంగిక దాడి..అట్టుడికిన మధ్యప్రదేశ్..మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు
ఆవుపై లైంగిక దాడి..అట్టుడికిన మధ్యప్రదేశ్..మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు
Betul Violence : మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా ఆదివారం అట్టుడికిపోయింది. ఒక వ్యక్తి ఆవుపై అఘాయిత్యానికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇది కాస్తా తీవ్ర హింసకు దారితీసింది. నిరసనకారులు దుకాణాలు, వాహనాలు, ఒక ఇంటికి నిప్పు పెట్టడంతో ఆ ప్రాంతం యుద్ధ భూమిని తలపించింది. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా దామ్జీపురా ప్రాంతంలో ఆదివారం ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఒక వ్యక్తి ఆవుపై అసహజ లైంగిక దాడికి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. ఆ ఆవు నిందితుడిదే అయినప్పటికీ, ఈ పైశాచిక చర్యను చూసి స్థానిక హిందూ సంస్థలు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మొదలైన నిరసన, కొద్దిసేపటికే హింసాత్మక రూపం దాల్చింది.
ఆగ్రహంతో ఊగిపోయిన జనం నిందితుడికి సంబంధించినదిగా భావిస్తున్న ఒక పంచర్ షాపుకు నిప్పు పెట్టారు. అక్కడితో ఆగకుండా హింస ఇతర ప్రాంతాలకు పాకింది. నిరసనకారులు ఒక ఎలక్ట్రికల్ షాపు, సెలూన్, మొబైల్ స్టోర్, ఆటో పార్ట్స్ దుకాణాలతో సహా మొత్తం ఏడు దుకాణాలను దహనం చేశారు. అలాగే వీధుల్లో ఉన్న నాలుగు కార్లు, నాలుగు మోటార్ సైకిళ్లను ధ్వంసం చేసి, ఒక ఇంటికి నిప్పు పెట్టారు. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. ఈ అల్లర్లలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది.
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు భారీగా రంగంలోకి దిగారు. బేతుల్ ఎస్పీ వీరేంద్ర జైన్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, ఎవరూ పుకార్లు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే మహేంద్ర సింగ్ కూడా ప్రజలతో మాట్లాడి శాంతిని పాటించాలని కోరారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ తరహాలో ఆంక్షలు విధిస్తూ, సున్నితమైన ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు.