Yadadri-Bhongir: చిన్నారికి విషమిచ్చి..ఆత్మహత్యకు పాల్పడ్డ తండ్రి

Yadadri-Bhongir: మూడేళ్ల చిన్నారికి విషమిచ్చి ఒక తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన యాదాద్రి-భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది.

Update: 2026-03-25 06:37 GMT

Yadadri-Bhongir

Yadadri-Bhongir: భార్యా భర్తల మధ్య మనస్ఫర్ధలు సర్దుకుపోయేలా ఉండాలి. వాటిని పెద్దవి చేసుకుంటే ఒక్కోసారి జరిగే అనర్ధాలు అర్ధం అయ్యేసరికి జీవితం ముగిసిపోతుంది. పెను విషాదం చుట్టుముడుతుంది. ఇదిగో యాదాద్రి భువన గిరి దగ్గరా లచ్చమ్మ గూడెం గ్రామంలో సరిగ్గా అలాంటి విషాదమే చోటు చేసుకుంది. భార్యా భర్తల మధ్య చోటు చేసుకున్న వివాదాల కారణంగా అన్నెం, పున్నెం ఎరుగని ముద్దుల చిన్నారి బలైపోయింది. ఆ బిడ్డ తండ్రి చావు బతుకులతో ఆసుపత్రిలో పోరాడుతున్నాడు.

లచ్చమ్మ గూడెం గ్రామంలో జరిగిన ఈ విషాద సంఘటనలో, వైవాహిక వివాదం కారణంగా ఒక వ్యక్తి తన చిన్న కుమార్తెకు విషం ఇచ్చి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. స్థానికులు, పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

స్థానికంగా నివాసం ఉండే వరికుప్పల రవి(30) నాలుగేళ్ల క్రితం మాడ్గుల్ మండలానికి చెందిన ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు బిడ్డలు. పెద్ద కుమార్తె మేఘన వయసు మూడేళ్లు. చిన్న బిడ్డ వయసు 8 నెలలు. ఇటీవల కాలం వరకూ రవి దంపతులు తమ బిడ్డలతో సంతోషంగా జీవనం సాగిస్తూ వచ్చారు.

అభిప్రాయం బేధాలు..

ఇటీవల ఈ దంపతుల ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయి. తరుచు ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకునేది. ఈ క్రమంలో రవి భార్య తన ఎనిమిది నెలల బిడ్డను తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. మూడేళ్ళ మేఘన తండ్రి వద్దే ఉండిపోయింది. అయితే, తన భార్యను పుట్టింటి నుంచి రావాలని కోరినా ఆమె రాలేదు. ఎప్పటికీ ఆమె రాకపోయేసరికి రవి మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో మార్చి 21న, రవి ఆ చిన్నారి మేఘనకు ఎలుకల విషం ఇచ్చి, ఆ తర్వాత తను కూడా దానిని సేవించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

దీనిని గమనించిన స్థానికులు వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వారి పరిస్థితి విషమించడంతో, ఇద్దరినీ చికిత్స కోసం నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విషాదకరంగా, సోమవారం చిన్నారి మేఘన మరణించింది. ప్రస్తుతం రవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన అనంతరం రవి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News