ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు...వారిపై ప్రత్యేక దృష్టిసారించిన జగన్‌

Update: 2018-10-06 12:21 GMT

2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు సిద్ధంచేస్తోంది. అంతేకాదు గత ఎన్నికల్లో చేసిన తప్పులు ఈసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా బీసీలపై ప్రత్యేక దృష్టిసారించిన జగన్‌ బలహీనవర్గాలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనుకుంటున్న వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పార్టీకి దూరంగా ఉన్న సామాజిక వర్గాలపై దృష్టిపెట్టారు. ముఖ్యంగా మొదట్నుంచీ టీడీపీకి వెన్నుదన్నుగా, బలమైన మద్దతుదారులుగా ఉన్న బీసీలను తనవైపు లాక్కునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో బీసీలు వైసీపీకి దూరంగా ఉండటం వల్లే అధికారం తృటిలో చేజారిందని గ్రహించిన జగన్‌ ఈసారి మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అందుకే బీసీలకు దగ్గరయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా బీసీల్లో వివిధ కులాల సమస్యలపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేసిన జగన్‌ ఆయా బీసీ కుల సంఘాలతో సమావేశమవుతున్నారు. బీసీలతో ముఖాముఖిగా మాట్లాడుతూ నేరుగా సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు. ఇక బీసీల సమస్యలపై అధ్యయనం చేస్తోన్న కమిటీ త్వరలో జగన్‌‌కు నివేదిక అందజేయనుంది. ఆ నివేదిక ఆధారంగానే బీసీ డిక్లరేషన్‌ రూపొందించి ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. 

పాదయాత్ర ముగిసిన తర్వాత పెద్దఎత్తున బీసీ గర్జన నిర్వహించేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఈ సభలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించి బలహీన వర్గాలకు దగ్గర కావాలని జగన్‌ భావిస్తున్నారు. అలాగే రాజకీయంగా బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించి వైసీపీ వైపు ఆకర్షించాలని వ్యూహరచన చేస్తున్నారు. మరి జగన్‌ ప్రయత్నాలు ఫలించి బీసీలు వైసీపీకి మద్దతిస్తారో లేదో చూడాలి.

Similar News