కారెక్కిన వారికీ కాంగ్రెస్‌ పదవులు...టీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డికి 3 కీలక పదవులు...

Update: 2018-09-20 05:03 GMT

కాంగ్రెస్‌ కొత్త కమిటీలపై గొడవ మొదలైంది. వీహెచ్‌, పొంగులేటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు గులాబీ కండువా కప్పుకున్న సురేష్‌ రెడ్డికి, పలు కమిటీల్లో చోటు కల్పించడం కూడా చర్చనీయాంశమమైంది.

కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన నూతన కమిటీలు రాష్ట్ర కాంగ్రెస్‌లో చిచ్చు రేపాయి. తమకు తగిన అవకాశలు దక్కలేదంటూ పలువురు సీనియర్ నేతలు మండిపడ్డారు. ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి దక్కకపోవడంతో సీనియర్ నేత  వీహెచ్ తీవ్ర స్ధాయిలో అసంతృప్తి చెందారు. గాంధీ భవన్ నుంచి బయటకు వచ్చిన ఆయన, వాహనం కోసం కూడా ఎదురుచూడకుండా  నాంపల్లి సిగ్నల్ వరకు నడుచుకుంటూ వెళ్లిపోయారు. 

మల్లు బట్టి విక్రమార్కకు, రెండు పదవులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీల్లో ఒక్క గిరిజనుడికి కూడా చోటు కల్పించలేదన్న ఆయన పదవి ఇచ్చి తనను అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమయంలో ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటానంటూ సన్నిహితుల దగ్గర ప్రస్తావించినట్టు సమాచారం. 

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో టీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డికి కీలక పదవి దక్కడం చర్చనీయాంశమైంది. కో ఆర్టినేషన్ కమిటీలో ఆయనకు స్థానం కల్పించారు. మొత్తం మూడు కమిటీల్లో సురేష్ రెడ్డికి చోటు కల్పించినట్లు తెలుస్తోంది. ఇటీవలె అట్టహాసంగా గులాబీ గూటికి చేరారు సురేష్‌ రెడ్డి. మరి సురేష్‌కు, కమిటీల్లో ఎలా స్థానం కల్పించారన్నది నేతలకు బోధపడ్డం లేదు. అంటే, చాలారోజుల ముందే కమిటీల పేర్లు ఖరారు చేశారా లేదంటే పొరపాటుగా సురేష్‌ పేరును ముద్రించారా అదీకాదంటే కావాలనే టీఆర్ఎస్‌లో గందరగోళం సృష్టించేందుకు సురేష్‌కు పదవి కట్టబెట్టారా అన్నది అర్థం కావడం లేదు.  మొత్తానికి కొత్త కమిటీలతో సమరోత్సాహంతో కాంగ్రెస్‌ ఎన్నికల బరిలోకి వెళుతున్న సమయంలో, అసంతృప్త జ్వాలలు రేగుతున్నాయి. మరి కాంగ్రెస్‌లో సర్వసాధారణమైన ఈ అలకలను, కాంగ్రెస్‌ అధిష్టానం ఎలా సర్దిచెప్పుతుందో చూడాలి.

Similar News