నాకు ప్రాణహాని ఉంది సర్‌...ప్రజలతో మాట్లాడేందుకు ఒక్క అవకాశాన్ని కల్పించండి

Update: 2018-10-30 12:35 GMT

జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు.. తనకు ప్రాణహాని ఉందన్నాడు. అస్వస్థతకు గురైన అతన్ని ఎయిర్ పోర్టు పీఎస్ నుంచి కేజీహెచ్‌ కు తరలిస్తుండగా.. తాను ప్రజలతో మాట్లాడాలని గట్టిగా కేకలు పెట్టాడు. తనకు ప్రాణహాని ఉందన్నాడు. ట్రీట్ మెంట్ వద్దని.. తాను అవయవాల దానం చేస్తానని శ్రీనివాసరావు చెప్పాడు. పోలీస్ స్టేషన్ నుంచి కేజీహెచ్‌ కు తరిస్తున్న సమయంలో.. మీడియాను చూసిన శ్రీనివాసరావు గట్టిగా కేకలు పెట్టాడు. ప్రజలతో మాట్లాడేందుకు ఒక్క అవకాశాన్ని కల్పించాలని.. తాను ప్రజలకు కొన్ని విషయాలు చెబుతానని అన్నాడు. నీరసంగా ఉన్న శ్రీనివాస్ ను పోలీసులు భుజాలపై మోసుకుని బయటకు తీసుకొచ్చారు. అనంతరం, జీపులో కేజీహెచ్‌కు తరలించారు. 

పోలీసుల కస్టడీలో ఉన్న శ్రీనివాసరావును మూడో రోజు కూడా ఉదయం నుంచి విచారించారు. అయితే, నీరసంగా ఉండటంతో పాటు అతను ఛాతీలో నొప్పితో ఇబ్బందిపడినట్టు తెలుస్తోంది. మొదట శ్రీనివాసరావుకి అందుబాటులో ఉన్న ప్రైవేటు డాక్టర్ తో ఫస్ట్ ఎయిడ్ నిర్వహించారు. డాక్టర్ సూచన మేరకు శ్రీనివాసరావును కేజీహెచ్ కి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన వెంటనే వైద్యపరీక్షలు  నిర్వహించారు. శ్రీనివాస్‌ను పరీక్షించిన వైద్యులు.. అతను గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. శ్రీనివాసరావు ట్రీట్‌మెంట్‌కు సహకరించడం లేదని డాక్టర్ దేముడు వెల్లడించారు. తనకు ట్రీట్‌మెంట్ వద్దని.. అవయవ దానం చేస్తానని శ్రీనివాస్ అంటున్నాడని డాక్టర్ దేముడు చెప్పారు. అంతేకాకుండా తాను ప్రజలతో మాట్లాడాలని గట్టిగా కేకలు పెడుతున్నాడని అన్నారు.

Similar News