ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొంటుంది: మంత్రి పార్థసారథి

రైతులకు అన్యాయం జరగకుండా ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేసి, 24 గంటల్లో పైకం చెల్లిస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు.

Update: 2025-12-14 11:51 GMT

మచిలీపట్నం : రైతులకు అన్యాయం జరగకుండా ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేసి, ఎక్కడా లేని విధంగా 24 గంటల్లో పైకం చెల్లిస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. రాష్ట్ర గౌడ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి జన్మదిన వేడుకలలో భాగంగా తొట్లవల్లూరులో ప్రభుత్వ వైద్యులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తాను రైతు బిడ్డ అని, రైతుల కష్టాలు తెలుసని, రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే తాను శనివారం కఠినంగా వ్యవహరించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం డబ్బులు రైతులకు చెల్లించే ఏర్పాటు చేశానన్నారు. కొంతమంది రైతులు నష్టపోతున్నట్లు తన దృష్టికి తీసుకొని వచ్చారన్నారు.

‘‘మా సొంత ఊరు కారకంపాడు నుండి వస్తుంటే పక్క గ్రామం పెద్ద ముత్తేవి నుండి 3 లారీల ధాన్యం లోడ్ చేసుకుని వెళుతుంటే, ఆ లారీలను ఆపి ఎక్కడి నుండి వస్తున్నాయో విచారించాను. ధాన్యాన్ని ఎవరు కొన్నారో వారిని పిలిపించి, ఎంతకి కొన్నారని వారిని అడిగాను. మొదట రూ.1550 అని, ఆ తరువాత రూ.1450కి కొనుగోలు చేసినట్లు చెప్పారు. అంత తక్కువకు ఎలా కొనుగోలు ఎలా చేశారని ప్రశ్నించాను. వెంటనే గోనె సంచిలో నుండి ధాన్యాన్ని బయటకు తీసి, తేమ శాతం పరీక్షించే యంత్ర పరికరాన్ని తెప్పించి పరిశీలించగా 22% తేమ ఉంది. అడిగితే, ధాన్యం రంగు మారిందని చెప్పారు. అక్కడే ఒక బేరగాడు ఉంటే ధాన్యాన్ని అరచేతిలో వేసుకుని నూరితే లోపల బియ్యం ఎక్కడ రంగు మారలేదన్నారు. బియ్యం అంతా బాగానే ఉన్నా నూక రంగు మారితే మీకు వచ్చే నష్టమేంటని ప్రశ్నించినట్లు’’ మంత్రి వివరించారు.

1650 రూపాయలు చెల్లిస్తే గాని లారీలను వెళ్ళనివ్వమని గట్టిగా చెప్పినట్లు చెప్పారు. గత ప్రభుత్వం లాగా రైతులకు డబ్బులు ఎగ్గొట్టే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు రైతులకు చెల్లిస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. దాదాపు 20 వేల కోట్ల రూపాయల నిధులను ధాన్యం డబ్బులు చెల్లింపు కోసం ముందుగానే సిద్ధం చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. 

Tags:    

Similar News