గుంటూరులో బాపు స్మారక పురస్కారాల ప్రదానం

సుప్రసిద్ధ సినీ దర్శకులు వర ముళ్ళపూడి, చిత్రకారుడు అరసవల్లి గిరిధర్, కార్టూనిస్టు హరి వెంకటరమణలకి బాపు స్మారక పురస్కారాలను ఈరోజు గుంటూరులో అందజేశారు.

Update: 2025-12-14 13:53 GMT

గుంటూరు: తన సినిమాలు, చిత్రాలు, కార్టూన్ల ద్వారా తెలుగును వెలిగించిన చిరస్మరణీయుడు బాపును స్మరించుకోవడం మన బాధ్యతగా భావించాలని సుప్రసిద్ధ గజల్ గాయకుడు మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ అన్నారు. స్థానిక భారతీయ విద్యాభవన్ లోని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఆడిటోరియంలో ఆదివారం ఉదయం బాపు-రమణ-బాలు కళాపీఠం, మల్లెతీగ సంయుక్త ఆధ్వర్యంలో బాపు జయంతి, బాపు స్మారక పురస్కారాల కార్యక్రమాలు జరిగాయి. సుప్రసిద్ధ సినీ దర్శకులు వర ముళ్ళపూడి, చిత్రకారుడు అరసవల్లి గిరిధర్, కార్టూనిస్టు హరి వెంకటరమణలకి బాపు స్మారక పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా వచ్చిన డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ- అందమైన స్త్రీని బాపు బొమ్మగా మనం ప్రశంసిస్తున్నామంటే, అది బాపు చిత్రాలకున్న గొప్పతనమన్నారు. తెలుగువారున్నంతకాలం బాపు సినిమాలు, చిత్రాలు, కార్టూన్లు సజీవంగా వుంటాయన్నారు. తెలుగు అమ్మ ఒడి భాష కావాలన్నారు. తెలుగును అధికార భాషకంటే ముందు మన మమకార భాషగా గుర్తించాలన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

బాపు-రమణ-బాలు కళాపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ రమణ యశస్వి మాట్లాడుతూ - బాపును స్మరించుకోవడం మన అదృష్టంగా భావించాలన్నారు. స్మరణ కూడా మరణాన్ని కొంతకాలం వాయిదా వేస్తుందన్నారు. ఆత్మీయ అతిథిగా వచ్చిన సుప్రసిద్ధ రచయిత డాక్టర్ ఎం.ప్రభాకర్ మాట్లాడుతూ-బాపు సినిమాల్లోని కొన్ని ముఖ్య సన్నివేశాల్ని, పాటల్ని గుర్తు చేసి సభకుల్ని అలరించారు. మరో అతిథి సాహితీ సమాఖ్య గుంటూరు కార్యదర్శి ఎస్.వి.ఎస్. లక్ష్మీనారాయణ బాపు ప్రతిభను తెలిపే సంగతుల్ని గుర్తు చేశారు. తొలుత మల్లెతీగ సంపాదకులు కలిమిశ్రీ అతిధుల్ని వేదికపైకి ఆహ్వానిస్తూ, బాపు దర్శకుడిగా, చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా సేవలందించి తన ప్రతిభను కళా సాంస్కృతిక సంపదను రేపటి తరాలకు దాచి వుంచారన్నారు. అనంతరం పురస్కార గ్రహీతలు తమ స్పందనను తెలియజేస్తూ బాపు గారితో వున్న తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Tags:    

Similar News