మత్స్యకారుల శిక్షణా తరగతులు విజయవంతం
తమిళనాడు, కేరళలలో ఏపీ తీరప్రాంత మత్స్యకారుల శిక్షణా తరగతులు వారంరోజులపాటు జరిగి, విజయవంతంగా ముగిశాయి.
అమరావతి: తమిళనాడు, కేరళలలో ఏపీ తీరప్రాంత మత్స్యకారుల శిక్షణా తరగతులు వారంరోజులపాటు జరిగి, విజయవంతంగా ముగిశాయి. ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా అధ్యయనం, అవగాహన, శిక్షణ కార్యక్రమాలు జరిగాయి. తమిళనాట కేజ్ కల్చర్, రిఫ్ కల్చర్, ఆధునిక మార్కెటింగ్ వ్యవస్థలపై శిక్షణ ఇచ్చారు. కేరళలో మోడల్ ఫిషింగ్ హార్బర్, అత్యాధునిక వలల తయారీపై అధ్యయనం చేశారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అవలంభిస్తున్న సాంకేతికత సాయంతో ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంత మత్స్యకారులకు వసతులు కల్పించేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మత్స్యశాఖ అధికారులకు సూచించారు.
మత్స్య సంపదతో ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అవసరం అయిన అధునాతన పద్దతులపై అధ్యయనం చేసేందుకు ఉప్పాడకు చెందిన మత్స్యకారులను తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపారు. ఈ నెల 8వ తేదీన మొత్తం 60 మంది రెండు బృందాలుగా ఆయా రాష్ట్రాలకు వెళ్లారు. స్థిరమైన ఆర్ధికాభివృద్ధి సాధించడం ఎలా అనే అంశంపై రెండు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు శిక్షణ ఇప్పించారు. అధునాతన కేజ్ కల్చర్, రిఫ్ కల్చర్, మార్కెటింగ్ వ్యవస్థల ఏర్పాటు, అన్ని హంగులతో నిర్మించిన హార్బర్ల సందర్శన, హ్యాచరీల్లో చేపల గుడ్లు పొదిగించడం, వలల తయారీ తదితర అంశాల్లో సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CSMCRI), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ (NIPHT)లతో శిక్షణ ఇప్పించారు. మొదట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అక్కడ అమలు చేస్తున్న విధానాలను వివరించారు. తదుపరి క్షేత్ర స్థాయిలో సందర్శనలకు ఏర్పాటు చేశారు.
మండపం, విల్లుపురంలో మొదటి బృందం అధ్యయనం
తమిళనాడు సందర్శనకు వెళ్లిన ఉప్పాడ మత్స్యకార బృందం చెన్నైలోని మండపం వద్ద ఉన్న సి.ఎస్.ఎం.సి.ఆర్.ఐ.ని సందర్శించారు. అక్కడ మెరైన్ నిపుణులు కృత్రిమ, సహజ పద్దతుల్లో సాగు చేస్తున్న కేజ్ కల్చర్, రిఫ్ కల్చర్ లపై మత్స్యకారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. సముద్ర తీర ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సముద్ర వనరుల దీర్ఘకాలిక సంరక్షణకు అవలంభించాల్సిన శాస్త్రీయ విధానాలను ఉప్పాడ మత్స్యకారులకు తెలియజేశారు. అనంతరం విల్లుపురంలోని గోల్డెన్ మెరైన్ హార్వెస్ట్ హ్యాచరీని సందర్శించి మత్స్య సంపద సృష్టిలో వస్తున్న నూతన సాంకేతికతపై అధ్యయనం చేశారు. చెన్నై మెరినా బీచ్ సమీపంలోని ఆధునిక మౌలిక వసతులతో కూడిన చేపల మార్కెట్ ని సందర్శించారు. మార్కెట్ వద్ద చేపలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునేందుకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్షేత్ర స్థాయి పరిశీలనలో పరిశుభ్రమైన వాతావరణంలో చేపల అమ్మకం, కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలు, మత్స్య సంపద గ్రేడింగ్, వేలం నిర్వహణ, వ్యర్ధాల నిర్వహణ విధానాలు, సప్లయి చైన్ తదితర అత్యాధునిక సదుపాయాలపై అవగాహన తెచ్చుకున్నారు. ఈ పర్యటన ద్వారా ఆధునిక సదుపాయాల కల్పన ద్వారా మత్స్యకారుల ఆదాయం ఎలా వృద్ధి చెందుతుంది అనే అంశాన్ని తెలుసుకున్నారు.
మత్స్య సంపద వృద్ధిపై కేరళలో అధ్యయనం
కేరళ పర్యటనలో భాగంగా ఉప్పాడకు చెందిన రెండో మత్స్యకార బృందం ఎన్.ఐ.పి.హెచ్.టిలో మూడు రోజులపాటు నిపుణుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్నారు. వేటలో సాంకేతిక మేళవింపు, స్థిరమైన ఆదాయార్జన, ఆర్ధికంగా లాభదాయక విధానాలు అవలంభించడం ఎలా? అనే అంశాలపై వీరు అధ్యయనం చేశారు. మునంబంలోని మోడల్ ఫిషింగ్ హార్బర్ సందర్శించి అక్కడ ఆధునిక పద్దతులలో వలల తయారీ ప్రక్రియ, వారు పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలు, మార్కెటింగ్ విధానాలను తెలుసుకున్నారు. చేపల గుడ్లు పొదిగించడం, రకరకాల జాతుల చేప పిల్లల హ్యాచరీలు సందర్శించారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు అమలు చేస్తున్న అధునాతన విధానాలు, వాటివల్ల కలుగుతున్న లాభాలపై ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులకు ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అవకాశం కలిగింది.