విజయనగరం గుర్ల మండలంలో స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన

విజయనగరం గుర్ల మండలంలో కళకళలాడే పచ్చటి పంటపొలాలు పరిశ్రమల ఏర్పాటుతో కనుమరుగుకాబోతున్న సాగు భూములు గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏర్పాటుకి జీవో జారీ

Update: 2025-12-15 07:02 GMT

విజయనగరం గుర్ల మండలంలో స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన

ఎటుచూసినా పచ్చటి పంటలు పొలాలు.. వాటినే సాగు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న అన్నదాత గుండెల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. విజయనగరం జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. వ్యవసాయ భూములను పారిశ్రామిక వినియోగానికి కేటాయించింది. దీంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పరిశ్రమలతో మా జీవితాలు, పాడి పంటలను నాశనం చేయొద్దంటూ వేడుకుంటున్నారు.

విజయనగరం జిల్లా గుర్ల మండలం పచ్చటి పొలాలతో కళకళలాడుతుంది. ఇప్పుడు అవే పంటలు పరిశ్రమల ఏర్పాటుతో కనుమరుగు కాబోతున్నాయి. గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొత్తం 1వేయి 85 ఎకరాలు సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్‌కు కేటాయించబోతుంది. అదనంగా 97.04 ఎకరాలు స్టాఫ్టౌన్‌ షిప్‌కు, 53.35 ఎకరాలు రైల్వే సైడింగ్ కనెక్టివిటీకై కేటాయించనున్నారు. దీంతో గుర్ల మండలంలోని కెళ్ళ, బెల్లానపేట, దమరసింగి, మన్యపురిపేట, ఎస్ఎస్ఆర్‌పేట గ్రామాల్లోని సారవంతమైన భూముల్లో ఈ ప్రాజెక్టును నెలకొల్పనున్నారు. సూపర్ స్మెల్టర్స్ మొత్తం 8వేల 570 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో స్టీల్ ప్లాంట్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

మొదటి దశలో ఒక ఎంటీపీఏ సామర్థ్యంతో 2029 నాటికి నిర్మాణం పూర్తి చెయ్యాలని.. రెండో దశ 2032 నాటికి పూర్తి చేసి మొత్తం 2 ఎంటీపిఏ సామర్థ్యాన్ని చేరుకోవాలని భావిస్తుంది. ఐతేమూడు పంటలు పండే సారవంతమైన భూములు, పల్లె వాతావరణం… అన్నీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపొయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. స్టీల్ ప్లాంట్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమంటున్నారు ఇక్కడి రైతులు... పరిశ్రమల ఏర్పాటుతో కాలుష్యంతో అనేక రకాల సమస్యలు ఏర్పడుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ప్రాజెక్టు వల్ల 750 ఉద్యోగాలు మొదటి దశలో, 250 ఉద్యోగాలు రెండో దశలో ఉద్యోగాలు రానున్నాయి. కానీ, 700 ఎకరాలు జిరాయితీ, 300 ఎకరాలు డీ పట్టా భూములు ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇవ్వనున్నది. దీంతో ముఖ్యంగా బెల్లానపేట గ్రామం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్లాంట్ నిర్మాణంతో గ్రామాలు, ఇళ్లు, పంటలు కోల్పోయే పరిస్థితి రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

తరతరాలుగా సాగుచేసుకుంటూ వచ్చిన పంట భూములను వదులుకోవాల్సి వస్తుందా? వచ్చిందంటే ప్రభుత్వం సరైన పరిహారం ఇస్తుందా? అన్న ప్రశ్నలతో ప్రజల్లో భయం వ్యక్తమవుతోంది. ప్లాంట్ వస్తే అభివృద్ధి చెందడం ఏమో కానీ.. మా జీవితాలు బుగ్గిపాలవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దీనిపై పునరాలోచన చేయాలని విన్నవించుకుంటున్నారు.

Tags:    

Similar News