కర్నూలు హైవేపై ఆటోలతో ప్రమాదకర విన్యాసాలు.. ముగ్గురు యువకుల అరెస్ట్, వాహనాలు సీజ్!
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి (NH 44)పై కొందరు యువకులు చేసిన అత్యుత్సాహం వాహనదారులను హడలెత్తించింది.
హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి (NH 44)పై కొందరు యువకులు చేసిన అత్యుత్సాహం వాహనదారులను హడలెత్తించింది. ఆటోలతో రోడ్డుపై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ముగ్గురు యువకులను కర్నూలు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
ఒంటి టైరుపై ఆటో డ్రైవింగ్.. సోషల్ మీడియాలో వైరల్:
ఈనెల 1వ తేదీ రాత్రి పంచలింగాల సర్కిల్ వద్ద ముగ్గురు యువకులు రెండు ఆటోలతో విన్యాసాలు చేశారు. రోడ్డుపై ఒక టైరును గాల్లోకి లేపి అత్యంత వేగంగా ఆటోలను నడుపుతూ ఇతర వాహనదారులను భయాందోళనకు గురిచేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తీవ్రంగా పరిగణించారు. వెంటనే నిందితులను పట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.
నిందితుల గుర్తింపు - కఠిన చర్యలు:
పోలీసుల దర్యాప్తులో నిందితులు మమతా నగర్‌కు చెందిన శివ మల్లేష్, అఖిల్ మరియు శ్రీకృష్ణ కాలనీకి చెందిన జయసింహలుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీజ్ చేసిన ఆటోలను రవాణా శాఖకు అప్పగించారు. నిందితుల తల్లిదండ్రులను పిలిపించి పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ ఇప్పించారు.
పోలీసుల హెచ్చరిక:
ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ.. సరదా కోసం రోడ్లపై ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. విన్యాసాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు.