చలిమంటలు, బొగ్గుల కుంపటీలతో జాగ్రత్త..

Update: 2018-12-22 02:38 GMT

నాలుగు రోజుల కిందటే ఇంట్లో పొగచూరడంతో  తల్లి కొడుకు మరణించిన సంగతి మరవకముందే ఇదే తరహా ఘటన మరోటి వెలుగులోకి వచ్చింది. చలితీవ్రతకు తట్టుకోలేక ఇంట్లో బొగ్గుల కుంపటి పెట్టుకున్నారు. దాంతో ఊపిరాడక నలుగురు యువకులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ లోని శామీర్ పేట మండలం బొమ్మరాశిపేటలో జరిగింది. మృతులు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సతీష్ గౌడ్, అరవింద్ గౌడ్, మహేశ్ ముదిరాజ్, మహేందర్ రెడ్డి గా గుర్తించారు. మృతుల్లో ఒకడైన అరవింద్ గౌడ్, మిత్రుడు క్రాంతి కలిసి స్థలం లీజుకు తీసుకొని ఫామ్ ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం అందులో పార్టీ చేసుకున్నారు. పార్టీ అవగానే క్రాంతి అక్కడి నుంచి వెళ్లపోగా మిగిలిన నలుగురు గదిలో కుంపటి వేసుకొని పడుకున్నారు. పొగ గది నిండా వ్యాపించటంతో  శ్వాస ఆడలేదు. దాంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి కాసేపటికి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలావుంటే ఇంట్లో చలిమంటలు, బొగ్గుల కుంపటి వేసుకున్నప్పుడు కిటికీలు తలుపులు తీసెయ్యాలని  అధికారులు సూచిస్తున్నారు. అలా చేయకుంటే ఇల్లు మొత్తం  కార్బన్ డై యాక్సైడ్ తో నిండిపోయి ఆక్సిజన్ అందకుండా పోతుందని అంటున్నారు.

Similar News