చిన్నారి నరబలి కేసును ఛేదించిన పోలీసులు

Update: 2018-02-06 06:11 GMT

ఉప్పల్‌లో సంచలనం సృష్టించిన చిన్నారి నరబలి కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం..ఇంటి యజమాని క్యాబ్ డ్రైవర్ రాజశేఖరే ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. భార్య శ్రీలత ఆరోగ్యం మెరుగ పడటం కోసమే ఓ పాపను తీసుకొచ్చి బలిచ్చినట్లు సమాచారం. కరీంనగర్‌లోని ఓ తండా నుండి పాపను తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు రాజశేఖర్ వెల్లడించాడు. 

కేసు వివరాల్లోకి వెళితే ఉప్పల్ చిలుకానగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజశేఖర్ క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య ఆరోగ్యం బాగుండటం లేదని పూజారుల వద్దకు తిరిగాడు. పూజారులు చెప్పిన విధంగా చంద్రగ్రహణం రోజు క్షుద్రపూజలు నిర్వహించాడు. క్షుద్రపూజలో భాగంగా అప్పటికే తాము కొనుగోలు చేసిన చిన్నారిని బలి ఇచ్చాడు. అనంతరం ఉదయం మొండాన్ని మాయం చేసిన రాజశేఖర్, తలను ఇంటి దాబాపై ఉంచాడు. తలను మాయం చేయడానికి వీలుకాకపోవడంతో తన ఇంటిపై పాప తల ఉందని పోలీసులకు సమాచారం అందించాడు. అయితే రాత్రి ఆరవేసిన బట్టలు తీయడానికి కుటుంబ సభ్యులు భవనంపైకి వెళ్లారని. ఉదయం 11 గంటల సమయంలో వెళ్లిన వారికి సుమారు మూడునెలల వయస్సు కలిగిన చిన్నారి తలను గమనించానని రాజశేఖర్ స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. 

రాజశేఖర్ ఇచ్చిన సమాచారంతో అతడి ఇంటి సమీపంలోని నరహరి ఇంటిలో క్షద్ర పూజలు జరిగినట్లు గుర్తించారు. గ్రహణ సమయంలో పూజలు చేసి పాపను బలిచ్చినట్లు పోలీసులను రాజశేఖర్ తప్పదారి పట్టించాడు. పోలీసులు మెకానిక్ నరహరి, అతని కొడుకు రంజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించిన పోలీసులకు నేరానికి పాల్పడినట్లు ఎటువంటి ఆధారం లభించలేదు. కేసు విషయంలో రాజశేఖర్ వ్యవహార శైలిపై అనుమానం రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో నిందితుడు తాను చేసిన ఘోరాన్ని ఒప్పుకున్నాడు.

Similar News