అత్తారింట్లో ‘అల్లుడి కిరాతకం’

Update: 2018-03-21 05:22 GMT

ఉగాది పండగ కోసం అత్తారింటికి వచ్చిన అల్లుడు కిరాతకానికి ఒడిగట్టాడు. అత్తమామలను బయటకు పంపి మరీ భార్య, ఇద్దరు పిల్లలను గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. బాబు పాఠశాల సమయం అవుతోందని ఇంటికి తొందరగా వెళ్దామని భర్త అన్న మాటలకు వద్దని సమాధానం చెప్పినందుకు భార్యను, ఇద్దరు పిల్లలను చంపానని మీర్‌పేట ఠాణాలో లొంగిపోయిన నిందితుడు పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత వేరుకాపురం పెడదామని ఒత్తిడి తెస్తుండటంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డానని నిందితుడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. అయితే ఇద్దరు పిల్లలను కూడా కడతేర్చడం వెనక అసలు ఉద్దేశం ఏమిటనే దిశగా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. 

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పుగూడకు చెందిన తుమ్మ మహేష్‌, జ్యోతిల పెద్ద కుమార్తె వరలక్ష్మి(28)కి.. లింగంపల్లిలోని కొమరంభీమ్‌ కాలనీకి చెందిన సంగిశెట్టి సురేందర్‌ (32)తో తొమ్మిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి నితీష్‌ (5), యశస్విని(3)లు ఉన్నారు. సోమవారం సాయంత్రం బడంగ్‌పేటలోని అత్తారింటికి సురేందర్‌, భార్య వరలక్ష్మి.. ఇద్దరు పిల్లలతో వచ్చారు. మంగళవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో భార్య వరలక్ష్మిని నిద్రలేపి ఇంటికి వెళ్దామని సురేందర్‌ అడగ్గా ఆమె లేచి మళ్లీ నిద్రపోయింది. ఉదయం 6గంటలకు ఆమెను మళ్లీ లేపగా తొందరేముంది వెళ్దామంది. దీంతో వారిమధ్య మాటామాటా పెరిగింది. దీంతో సురేందర్‌ భార్య గొంతు నులిమేశాడు. పక్కనే నిద్రిస్తున్న కూతురు యశస్వినిని, అమ్మమ్మ వద్ద ఆడుకుంటున్న కొడుకునూ గొంతు పిసికి చంపేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా కల్లు తాగుదాం తీసుకురమ్మని చెప్పి మామను, మరో పనిమీద బావమరిదిని, ఉప్మారవ్వ తెమ్మని అత్తను బయటకు పంపించాడు. వారంతా బయటకు వెళ్లగానే మామ మహేష్‌కు ఫోన్‌ చేసి వరలక్ష్మిని, ఇద్దరు పిల్లలను హత్యచేశానని చెప్పాడు. కారులో వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. తన భర్త ద్వారా విషయం తెలుసుకున్న జ్యోతి లబోదిబోమంటూ కుప్పకూలింది. వరలక్ష్మి, పిల్లలను ఒవైసీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందారని వైద్యులు తెలిపారు. గొంతు నులిమే వారిని అంతమొందించినట్లు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు పేర్కొన్నారు. ఎల్‌బీనగర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు, వనస్థలిపురం ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ మన్మోహన్‌లు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌టీమ్‌, పోలీసు జాగిలాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. డీసీపీ మాట్లాడుతూ కుటుంబ కలహాల వల్లే అతను హత్యలు చేసి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు.

Similar News