రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ గా కేకే..? ఎలా అంటే..

Update: 2018-06-19 11:15 GMT

తెరాస రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు త్వరలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ గా ఎంపిక అవ్వనున్నారా..? ఈ విషయమై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పెద్దలతో చర్చించారా..? అంటే అవుననే అంటున్నారు నేతలు. ప్రస్తుత డిప్యూటీ ఛైర్మెన్ పిజె కురియన్ పదవీకాలం త్వరలో ముగుస్తోంది.ఆయన స్థానంలో మరొకరిని ఎంపిక చెయ్యాలి. అయితే ఈ పదవికి 122 మంది సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం అధికార ఎన్డీఏకు రాజ్యసభలో 87 మంది సభ్యులున్నారు.  యూపీఏకు 58 మంది సభ్యులున్నారు. సొంతంగా డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నిక సాధ్యమవదు గనక బీజేపీయేతర అభ్యర్థి అయితే కొంత మేర లాభం పొందవచ్చని బీజేపీ భావిస్తోంది. మొన్నటిదాకా ఎన్డీఏలో ఉన్న పీడీపీ, టీడీపీ పార్టీలు తప్పుకున్నాయి. పైగా శివసేన మద్దతుపై స్పష్టతలేదు. ఈ నేపథ్యంలో వేరే పార్టీలకు డిప్యూటీ ఛైర్మెన్ అవకాశం కల్పించి తద్వారా వచ్చే ఎన్నికల్లో పొత్తుకు మార్గం సుగమం చేసుకోవచ్చనే ఆలోచనలో బీజేపీ ఉంది. ఈ విషయాన్నీ గ్రహించిన తెరాస అధినేత కేసీఆర్ ఇప్పటికే బీజేపీ నేతలతో సమావేశమై చర్చించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొన్న ఢిల్లీ వెళ్లిన సీఎం పనిలో పనిగా డిప్యూటీ ఛైర్మెన్ తమ పార్టీ ఎంపీకి కేటాయించాలని ప్రధాని మోడీకి ప్రతిపాదించినట్టు సమాచారం. వాస్తవానికి ప్రాంతీయ పార్టీల్లోనూ తెరాస కంటే ఎక్కువ రాజ్యసభ సభ్యులున్న పార్టీలు.. తృణమూల్‌ కాంగ్రెస్‌కు 13 మంది, సమాజ్‌వాదీ పార్టీకి 13 మంది ఉన్నా వారు ఈ పదవిపై పెద్దగా ఆసక్తి కనబరచడంలేదు. ఈ సమాచారంతోనే కేసీఆర్ డిప్యూటీ ఛైర్మెన్ గా కేకే ను ఎంపిక చెయ్యాలని బీజేపీకి ప్రతిపాదించినట్టు రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 

Similar News