ఎర్రటి ఎండలో ఎర్ర కండువా కట్టిన జనసేనాని

Update: 2018-04-06 11:11 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ మరోసారి జనం మధ్యకొచ్చారు. తలపై ఎర్రటి కండువా కట్టుకుని ఎర్రటి ఎండలో మూడు కిలోమీటర్లు నడిచారు. వామపక్షాలతో కలిసి పవన్‌ చేపట్టిన ఈ పాదయాత్రలో జనసేన, సీపీఎం, సీపీఐ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నమ్మకం ద్రోహం చేశాయన్న పవన్ త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.

జనసేనాని మరోసారి జనం మధ్యకొచ్చారు. ఎర్రటి ఎండలో ఎర్ర కండువా కట్టుకుని బెజవాడలో పాదయాత్ర చేపట్టారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్లు నడిచారు. వామపక్షాలతో కలిసి పవన్‌ చేపట్టిన ఈ పాదయాత్ర బెజవాడ బెంజి సర్కిల్‌ నుంచి రామవరప్పాడు వరకు సాగింది. ఈ పాదయాత్రలో సీపీఎం కార్యదర్శి మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణతో జనసేన, వామపక్ష కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన పవన్‌ అభిమానులతో బెంజిసర్కిల్‌ కిక్కిరిసిపోయింది. హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయన్న పవన్ కల్యాణ్‌ త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. పవన్‌ కల్యాణ్‌ పిలుపుతో ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో జాతీయ రహదారులపై జనసేన శ్రేణులు పాదయాత్రలు నిర్వహించారు. వామపక్ష పార్టీలతో కలిసి నేషనల్‌ హైవేలపై భారీ ర్యాలీలు చేపట్టారు.

Similar News