ఎన్నికల ఎఫెక్ట్.. సొంత ఊళ్లకు పరుగో పరుగు..

Update: 2018-12-05 06:40 GMT

ఎల్లుండి(డిసెంబర్ 7) తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సొంత ఊళ్లకు పరుగులు పెడుతున్నారు. బ్రతుకుదెరువు కోసం చాలా మంది ప్రజలు పట్టణాలకు వలస వెళ్లారు. ఈ క్రమంలో ఎన్నికలు ఉండటంతో వారంతా తమ స్వస్థలాలకు బయలుదేరి వెళుతున్నారు. పోలింగ్ రోజున అధికారిక సెలవు, ఆ తరువాత రెండవ శనివారం, ఆదివారం సాధారణ సెలవు ఇలా వరుసగా మూడు రోజులు సెలవలు వచ్చాయి. దాంతో ఇదే పండగ సీజన్ అనుకుంటున్నారో ఏమో పట్టణాల్లో ఉన్న గ్రామ ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు.

పోలింగ్ రోజున ప్రయాణం చెయ్యడానికి వీలుపడదు కనుక ఒకరోజు ముందుగానే వెళుతున్నారు. దాంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్ లు కిటకిటలాడిపోతున్నాయి. ఎన్నికల కమిషన్ సైతం వీరి తరలింపుపై ప్రత్యేక దృష్టిసారించింది. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించింది. సాధారణంగా హైదరాబాద్ నగరం నుంచి రోజుకు 3 లక్షల మంది ప్రయాణికులు  బస్సుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. ఇక పండగ సమయాల్లో మరో 1లక్ష మంది అదనం. అయితే ఈసారి ఆ సంఖ్య ఘననీయంగా పెరిగే అవకాశముంది. ఇక నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి మరో 2.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణం సాగిస్తుంటారు. వరుస సెలవుల్లో 50 వేల మంది అదనంగా ప్రయాణాలు సాగిస్తారు. ఎన్నికల నేపథ్యంలో మరో 50 వేల మంది అదనంగా రైళ్లలో ప్రయాణం చేసే అవకాశమున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.  

Similar News