బ్రహ్మంగారి కాలజ్ఞానమే నిజం కానుందా...తిరుమల ఆలయం గురించి చెప్పింది జరగబోతోందా?

Update: 2018-07-17 09:09 GMT

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన కాల జ్ఞానం నిజం కానుందా ? టిటిడి విషయంలో బ్రహ్మంగారి  జోస్యం ఏం చెబుతోంది ? తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి శ్రీవారి దర్శనం నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం దేనికి సంకేతం ? 

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన జోస్యాల్లో ఎన్నో నిజమయ్యాయి. ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అనడం, వినడం మనకు పరిపాటే. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలోను బ్రహ్మంగారు చెప్పిన జోస్యం నిజం అయ్యే రోజులు దగ్గరకొచ్చాయి.

ఆగస్టు 11 నుంచి ఆగస్టు 16 వరకు 6 రోజుల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేయాలని టిటిడి ధర్మకర్తల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆగమ పండితుల సలహా మేరకు ఆగస్టు 11 నుంచి ఆగస్టు 16 వరకు అష్టబంధన, బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలను తిరుమల కొండపై నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 11న మహా సంప్రోక్షణకు అంకురార్పణ జరగనుంది. వైదిక కార్యక్రమాలు జరపాల్సి రావడంతో భక్తుల రాకను రెండు రోజుల ముందు నుంచే నిలిపివేయడం జరుగుతోంది. 

టిటిడి విషయంలోను బ్రహ్మంగారు జోస్యం చెప్పారు. తిరుపతి వెంకన్న గుడి నాలుగు రోజులు పూజలేక మూత బడేను అని బ్రహ్మంగారు తన కాల జ్ఞానంలో చెప్పారు. ఇప్పుడు అదే విషయం వాస్తవ రూపం దాల్చనుంది. బ్రహ్మం గారి కాల జ్ఞానం మరోసారి నిజం కానుంది. 

కాశీ పట్న దేవాలయం నలభై రోజులు పాడుపడుతుందని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి భవిష్య వాణి చెప్పారు . బ్రహ్మంగారు చెప్పినట్లుగానే కాశీపట్న దేవాలయానికి  1910 – 12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్ళలేదు. 

Similar News