ఏపీ కేబినెట్ లోకి మరో ఇద్దరు...

Update: 2018-11-10 05:36 GMT

ఏపీ కేబినెట్ విస్తరణకు సీఎం చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. ఈనెల11న మంత్రివర్గ విస్తరణ జరగనుంది. కేబినెట్ లో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేస్తారని తెలుస్తోంది.  

ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారయ్యింది. ఈనెల11న ఉదయం 11గంటల 45 నిమిషాలకు మంత్రివర్గ విస్తరణ జరగదనుందని తెలుస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో మంత్రివర్గ విస్తరణ జరిగింది. నిబంధనల ప్రకారం, సీఎంతో కలిపి మొత్తం 26 మంది వరకు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం 24 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. 
  
గతంలో ముస్లిం, మైనార్టీలకు చోటు కల్పిస్తామని చెప్పిన సీఎం ఆ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే కేబినెట్ విస్తరణలో ఈసారి ఎస్టీ, ముస్లిం మైనార్టీ వర్గాలకు చోటు కల్పించనున్నారు. ఇటీవల మావోయిస్టుల దాడిలో మృతి చెందిన కిడారి సర్వేస్వరరావు కుమారుడు శ్రవణ్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఫరూక్‌కు కూడా కేబినెట్‌లో చోటు దక్కనున్నట్టు తెలుస్తోంది. 
    
ప్రస్తుతానికి ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేదు. దీంతో ఈ రెండు స్థానాలను భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ముస్లిం మైనారిటీల్లో రాయలసీమకు చెందిన నేతకే ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న ఫరూక్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. ఫరూక్‌ మండలి ఛైర్మన్‌గా ఉన్నందున ఆ స్థానంలో ఎవరిని నియమిస్తారనే చర్చ మొదలైంది. మరోవైపు, ఇటీవల మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు  కుమారుడు శ్రవణ్‌ని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అమరావతిలోని ప్రజావేదికలో ఈ నెల 11న మంత్రివర్గ విస్తరణ జరగనుంది.  
 

Similar News