రసవత్తరంగా ఆళ్లగడ్డ రాజకీయాలు

Update: 2018-04-26 05:59 GMT

అమరావతికి చేరిన ఆళ్లగడ్డ పంచాయితీకి మంత్రి అఖిలప్రియ వరుసగా రెండో రోజూ డుమ్మా కొట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇచ్చినా తనకు సమాచారం లేదంటూ ఎస్కేప్ అయ్యారు. అయితే మరో నేత ఏవీ సుబ్బారెడ్డి మాత్రం బాబు ఆదేశం మేరకు అమరావతి వచ్చారు. ఆళ్లగడ్డ వ్యవహారాన్ని సెటిల్ చేయాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఇద్దరు నేతలతో భేటీ కానున్నారు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. 30 ఏళ్లుగా భూమా నాగిరెడ్డి కుటుంబంతో అనుబంధం ఉన్న ఏవీ సుబ్బారెడ్డి మంత్రి అఖిలప్రియ మధ్య దూరం పూడ్చలేనంతగా పెరిగింది. పార్టీ పిలుపు మేరకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న ఏవీపై రాళ్లదాడి జరిగింది. ఇది అఖిలప్రియ అనుచరుల పనేనని సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు గతంలో చాలా ప్రయత్నాలే జరిగాయి. స్వయంగా ముఖ్యమంత్రి ఘర్షణలకు దిగొద్దని సూచించారు. అయినప్పటికీ పార్టీ పరువు బజారున పడేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాలను అమరావతికి వచ్చి తనను కలవాలని ఆదేశించారు. బాబు పిలుపు మేరకు ఏవీ సుబ్బారెడ్డి అమరావతికి వచ్చారు. మరోవైపు మంత్రి అఖిలప్రియ మాత్రం వరుసగా రెండో రోజూ డుమ్మా కొట్టారు. తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పిన మంత్రి ఆళ్లగడ్డలోనే ఉండిపోయారు. అయితే పార్టీ రాష్ట్ర కార్యాలయవర్గాలు మాత్రం అఖిలప్రియకు సమాచారాన్ని ఇచ్చినట్టుగా ప్రకటించాయి. 

సైకిల్‌ యాత్రలో తనపై జరిగిన రాళ్ల దాడితో పాటు అఖిలప్రియ వ్యవహార శైలిపై కూడా సుబ్బారెడ్డి సీఎంకు ఫిర్యాదు చేయనున్నారు. మంత్రి ప్రోత్సాహంతోనే తనపై రాళ్ల దాడి జరిగిందని ఆయన తేల్చి చెప్పారు. తండ్రి లాంటి తన మీద ఆమె రాళ్లు రువ్వించిందని, ఇప్పుడు చంద్రబాబు రమ్మన్నా రాలేదని అన్నారు. ఏవీ సుబ్బారెడ్డి అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్‌ నేతలతో భేటీ అయ్యారు. తనపై జరిగిన రాళ్లదాడి ఘటనకు సంబంధించిన ఆధారాలు అందచేశారు. ఈ సాయంత్రం చంద్రబాబు క్లాస్‌తో ఇద్దరు నేతలు దారికొస్తారా అదే ధోరణి కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

Similar News