Zomato : రెస్టారెంట్‌లో 300..యాప్‌లో 600..ఫుడ్ లవర్స్ జేబులకు చిల్లు పెడుతున్న ఆన్‌లైన్ ఫుడ్ ధరలు
Zomato : ఆకలేస్తే చాలు.. వెంటనే మొబైల్ తీసి జొమాటోనో, స్విగ్గీనో ఓపెన్ చేసి నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చేస్తున్నారా? అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే.
Zomato : రెస్టారెంట్‌లో 300..యాప్‌లో 600..ఫుడ్ లవర్స్ జేబులకు చిల్లు పెడుతున్న ఆన్‌లైన్ ఫుడ్ ధరలు
Zomato : ఆకలేస్తే చాలు.. వెంటనే మొబైల్ తీసి జొమాటోనో, స్విగ్గీనో ఓపెన్ చేసి నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చేస్తున్నారా? అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే. మనం సౌకర్యం కోసం ఆర్డర్ చేసుకుంటున్న ఆన్‌లైన్ ఫుడ్ వెనుక ఎంతటి ధరల వ్యత్యాసం ఉందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్ట్ ప్రకారం.. జొమాటో రెస్టారెంట్ అసలు ధర కంటే రెట్టింపు వసూలు చేస్తోందని ఒక మహిళా యూజర్ ఆధారాలతో సహా బయటపెట్టింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఇంటర్నెట్‌లో పెద్ద దుమారమే రేపుతోంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ కస్టమర్లను ఎలా బురిడీ కొట్టిస్తున్నాయో ఈ ఘటన అద్దం పడుతోంది.
అసలు ఏం జరిగింది?
నళిని అనే యూజర్ X వేదికగా రెండు ఫోటోలను షేర్ చేసింది. ఒకటి జనవరి 9, 2026 నాటి రెస్టారెంట్ ఒరిజినల్ బిల్లు కాగా, రెండోది అదే ఆర్డర్‌ను జొమాటో యాప్‌లో చూపిస్తున్న ధర. త్రిశివ్ చైనీస్ కార్నర్ అనే రెస్టారెంట్‌లో ఒక ఫుల్ చైనీస్ భేల్ (రూ. 160), ఒక ఫుల్ వెజ్ మంచూరియా (రూ.160) కలిపి మొత్తం బిల్లు రూ.320 మాత్రమే అయింది. కానీ అదే ఐటమ్స్ జొమాటో యాప్‌లో సెర్చ్ చేస్తే ఆశ్చర్యకరమైన ధరలు కనిపించాయి. డిస్కౌంట్లు పోను యాప్‌లో ఆ బిల్లు రూ.550 దాటేసింది. ఒకవేళ ఎలాంటి ఆఫర్లు లేకపోతే ఆ మొత్తం రూ.655 వరకు చూపిస్తోంది. అంటే నేరుగా వెళ్లి కొంటే వచ్చే ధర కంటే యాప్‌లో దాదాపు రెట్టింపు అన్నమాట!
జొమాటో ఇచ్చిన షాకింగ్ రిప్లై
ఈ ధరల వ్యత్యాసాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన నళిని.. జొమాటోను ట్యాగ్ చేస్తూ నిలదీసింది. దీనిపై స్పందించిన జొమాటో కేర్ టీమ్ వింత సమాధానం ఇచ్చింది. తమ ప్లాట్‌ఫారమ్‌పై కనిపించే ధరలను పూర్తిగా రెస్టారెంట్ భాగస్వాములే నిర్ణయిస్తారని, తమకు వాటితో సంబంధం లేదని బుకాయించే ప్రయత్నం చేసింది. తాము కేవలం కస్టమర్లకు, రెస్టారెంట్లకు మధ్య ఒక వారధిలా మాత్రమే పనిచేస్తామని చెప్పుకొచ్చింది. అయితే, ఈ సమాధానంపై నెటిజన్లు మరింత మండిపడుతున్నారు. రెస్టారెంట్ కంటే యాప్‌లో ధరలు ఎందుకు ఎక్కువగా ఉంటాయో అందరికీ తెలుసని, జొమాటో వసూలు చేసే భారీ కమిషన్ల వల్లే రెస్టారెంట్లు ధరలు పెంచుతున్నాయని విమర్శిస్తున్నారు.
కమిషన్ గుట్టు విప్పని కంపెనీ
జొమాటో సమాధానంపై సంతృప్తి చెందని నళిని.. మరొక కీలక ప్రశ్న వేసింది. ప్రతి ఆర్డర్‌పై జొమాటో రెస్టారెంట్ నుండి ఎంత కమిషన్ తీసుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేసింది. కానీ ఈ ప్రశ్నకు జొమాటో నుండి ఎలాంటి స్పందన రాలేదు. సాధారణంగా ఫుడ్ డెలివరీ యాప్స్ 25 నుండి 30 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తాయని, దానికి తోడు ప్లాట్‌ఫారమ్ ఫీజు, డెలివరీ చార్జీలు, జిఎస్టి వంటివి అదనంగా ఉంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ అదనపు భారమంతా చివరికి కస్టమర్ల మీదనే పడుతోంది. 300 రూపాయల భోజనానికి 600 రూపాయలు చెల్లించాల్సి రావడం ఎంతవరకు సమంజసమని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.
ఈ వైరల్ పోస్ట్ చూసిన తర్వాత చాలామంది తమ పాత అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. తాము కూడా గతంలో ఇలాగే ఎక్కువ ధరలు చెల్లించామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చే ముందు ఒక్కసారి రెస్టారెంట్ మెనూ ధరలను చెక్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీలైతే దగ్గరలో ఉన్న రెస్టారెంట్లకు నేరుగా వెళ్లి భోజనం చేయడం లేదా టేక్ అవే తీసుకోవడం ద్వారా మీ డబ్బును ఆదా చేసుకోవచ్చు. సౌకర్యం పేరుతో మన జేబులను ఖాళీ చేస్తున్న ఇలాంటి యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.