Cashew Farming: జీడిపప్పుతో కళ్లు చెదిరే ఆదాయం.. కోట్లు మీ సొంతం..!
Cashew Cultivation: జీడిపప్పు..ఈ డ్రై ఫ్రూట్ ను చిన్నా పెద్దా అందరూ ఇష్టపడతారు.
Cashew Farming: జీడిపప్పుతో కళ్లు చెదిరే ఆదాయం.. కోట్లు మీ సొంతం..!
Cashew Cultivation: జీడిపప్పు..ఈ డ్రై ఫ్రూట్ ను చిన్నా పెద్దా అందరూ ఇష్టపడతారు. ఒకప్పుడు ఉన్నత వర్గాలకు మాత్రమే పరిమితమైన ఈ తెల్ల బంగారం..ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలకు చేరువైపోయింది. రుచిలో రారాజైన ఈ జీడిపప్పుతో మనకు బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎన్నో ఖనిజాల గని జీడిపప్పు. కొలస్ట్రాలను నియంత్రించి హృదయాన్ని పదిలంగా ఉంచుతుంది. బీపీని నియంత్రించడంలో, రక్తపోటును తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ జీడిపప్పు సాయపడుతుంది.
జీడిపప్పు మన ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాదు..ఆర్థికంగా కూడా మనల్ని బలోపేతం చేస్తుంది. ఔనండి, జీడిపప్పు వ్యాపారం ఎంతో లాభదాయకం. సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఈ తెల్లబంగారం ఒక వరమని చెప్పాలి. ఎందుకంటే ఈ వ్యాపారంలో లక్షల ఆదాయం దాగి ఉంది.
జీడిపప్పుకు ప్రస్తుతం మార్కెట్ లో చాలా గిరాకీ ఉంది. దీన్ని అన్ని సీజన్లలో తింటారు కాబట్టి సాగు చేస్తే మార్కెట్ లో మంచి లాభాలు పొందవచ్చు. సాగు ఖర్చు కూడా చాలా తక్కువ కాబట్టి లాభాలు అధికంగానే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో జీడి సాగు అధికం. పలాసలో జీడి సాగుతో పాటు పప్పు ప్రాసెసింగ్ జరుగుతుంది. అర్జెంటుగా కోటి రూపాయలు కావాలంటే ఎక్కడైనా కష్టం కానీ పలాసలో మాత్రం ఒక గంటలో సాధ్యమని ఒక నానుడి ఉందంటే జీడిపప్పు ఎంతో లాభదాయకమో మనం అర్థం చేసుకోవచ్చు.
ఏపీలో 4.53 లక్షల ఎకరాల్లో ఈ జంబో ఫ్రూట్ సాగవుతుంది. లక్ష టన్నుల వరకు దిగుబడి వస్తుంది. జీడి ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ రెండవస్థానంలో ఉంది. ప్రతి ఏటా రూ.300 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. జీడి సాగు ఖర్చు కూడా తక్కువే. ఈ మొక్కను ఒక్కసారి నాటితే చాలు మళ్లీ మళ్లీ నాటాల్సిన పని లేదు. ఒక హెక్టారు భూమిలో 500 చెట్లను నాటితే చాలు సంవత్సరాల తరబడి లాభాలు అర్జించవచ్చు. ఒక చెట్టు నుండి దాదాపు 20 కిలోల జీడిపప్పు వస్తుంది. అంటే ఒక్క హెక్టారు నుంచి 10 టన్నుల దిగుబడిని ఆశించవచ్చు. జీడిపప్పు నుంచే కాదు జీడి తొక్కల నుంచి కూడా సంపాదించవచ్చు. జీడి తొక్కలను పెయింట్స్, కందెనల తయారీలో ఉపయోగిస్తారు.
శ్రీకాకుళం జిల్లాలో ఉన్నత విద్యావంతులు సైతం జీడి ప్రాసెసింగ్ యూనిట్లనే తమ ఉపాధి మార్గాలుగా ఎంచుకొని రెండు చేతులా సంపాదిస్తున్నారు. జీడిపప్పు కారణంగానే మిగతా ప్రాంతాల వారి కంటే ఇక్కడి మహిళలు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నారని కొన్ని సర్వేల్లో తేలింది. మరి, ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఇది తెల్లబంగారమే అని.