E Passport: ఈ-పాస్‌పోర్ట్ అంటే ఏంటి.? ఎలా అప్లై చేసుకోవాలి.? ఉప‌యోగాలు ఏంటి..!

E Passport: భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ వ్యవస్థను ఆధునీకరించే దిశగా పెద్ద అడుగు వేసింది.

Update: 2025-05-16 07:30 GMT

E passport: ఈ-పాస్‌పోర్ట్ అంటే ఏంటి.? ఎలా అప్లై చేసుకోవాలి.? ఉప‌యోగాలు ఏంటి..

E Passport: భారత ప్రభుత్వం పాస్‌పోర్ట్ వ్యవస్థను ఆధునీకరించే దిశగా పెద్ద అడుగు వేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ గతేడాది ఏప్రిల్ 1న ప్రారంభించిన ‘పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రాం (PSP) 2.0’లో భాగంగా, దేశవ్యాప్తంగా ఈ-పాస్‌పోర్ట్‌లను ప్రవేశపెడుతోంది. ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రయాణాలను సులభతరం చేయడమే ఈ ప్రోగ్రాం ప్రధాన లక్ష్యం.

ఈ-పాస్‌పోర్ట్ అంటే ఏంటి?

ఇది ఒక డిజిటల్‌ ఆధారిత పాస్‌పోర్ట్‌. సాధారణ పాస్‌పోర్ట్‌ల కన్నా ఇందులో టెక్నాలజీ ఆధారంగా మరింత భద్రత క‌ల్పిస్తారు. ఈ పాస్‌పోర్ట్ కవర్‌పై ఒక బంగారు చిహ్నం (చిప్‌) కనిపిస్తుంది. దీనిలో Radio-Frequency Identification (RFID) టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఎలక్ట్రానిక్ చిప్‌ ఉంటుంది. ఆ చిప్‌లో పాస్‌పోర్ట్‌దారుని వ్యక్తిగత వివరాలు, బయోమెట్రిక్‌ సమాచారం, ఫోటో తదితర కీలకమైన డేటా భద్రంగా నిల్వ ఉంటుంది. ఇది ఫోర్జరీ లేదా డేటా ట్యాంపరింగ్‌కు చెక్ పెడుతుంది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పాస్‌పోర్ట్‌ స్కానింగ్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది.

ప్రస్తుతం ఈ-పాస్‌పోర్ట్‌ ఎక్కడ అందుబాటులో ఉంది?

ఈ సేవలు దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో ఇంకా ప్రారంభం కాలేదు. ప్రాథమిక దశలో 13 నగరాల్లో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. అందులో హైదరాబాద్‌, చెన్నై, ఢిల్లీ, జైపూర్‌, నాగ్‌పూర్‌, భువనేశ్వర్‌, జమ్ము, గోవా, సిమ్లా, రాయ్‌పూర్‌, అమృత్‌సర్‌, సూరత్‌, రాంచీ ఉన్నాయి. కానీ, ఈ ఏడాది మొదటి అర్థభాగంలో అన్ని పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో ఈ సేవలు అందుబాటులోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది.

పాత పాస్‌పోర్ట్ ఉన్నవారికి ఇది తప్పనిసరా.?

అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న పాస్‌పోర్ట్‌లు వాటి గడువు తేదీ వరకు చెల్లుబాటు అవుతాయి. కొత్తగా దరఖాస్తు చేసే వారు, లేదా పాస్‌పోర్ట్ రీన్యువల్ చేస్తున్నవారు ఈ-పాస్‌పోర్ట్ ఎంపిక చేసుకోవచ్చు. ఇది పూర్తి గా ఆప్ష‌న్ అని అధికారులు తెలిపారు.

ఈ-పాస్‌పోర్ట్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

  • ముందుగా పాస్‌పోర్ట్ సేవా ఆన్‌లైన్ పోర్టల్ లేదా 'mPassport Seva' మొబైల్ యాప్‌ (Android/ iOSలో అందుబాటులో) ద్వారా రిజిస్ట్రేషన్ చేయాలి.
  • మీ రిజిస్టర్డ్ ఐడీతో లాగిన్ అవ్వాలి.
  • అనంత‌రం “Apply for Fresh Passport / Reissue of Passport” ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • మీరు కొత్తగా దరఖాస్తు చేస్తే ‘Fresh’ ను, పాత పాస్‌పోర్ట్ ఉంది అంటే ‘Reissue’ ఆప్షన్ ఎంచుకోవాలి.
  • అవసరమైన వివరాలు నమోదు చేసి ఫీజు చెల్లించాలి.
  • తర్వాత అపాయింట్‌మెంట్ బుక్ చేసి, రసీదును ప్రింట్ తీసుకోవాలి లేదా సేవ్ చేసుకోవాలి.
  • అపాయింట్‌మెంట్ తేదీన అవసరమైన అసలు పత్రాలతో మీ సమీప PSK లేదా RPOని సందర్శించాలి.
  • ప్ర‌క్రియ‌ పూర్తైన తర్వాత, కొత్త ఈ-పాస్‌పోర్ట్ మీ రిజిస్టర్డ్ చిరునామాకు పంపిస్తారు.
Tags:    

Similar News