Gold Price Evolution: బంగారం ‘సిరి’.. అప్పుడు మారుతి, ఇప్పుడు మెర్సిడెస్... 35 ఏళ్ల గోల్డ్ జర్నీ!

Gold Price Evolution: 1990లో కేజీ బంగారం ధరకు మారుతి కారు వస్తే, 2026లో మెర్సిడెస్ బెంజ్ వస్తోంది!

Update: 2026-02-05 08:20 GMT

Gold Price Evolution: బంగారం ‘సిరి’.. అప్పుడు మారుతి, ఇప్పుడు మెర్సిడెస్... 35 ఏళ్ల గోల్డ్ జర్నీ!

Gold Price Evolution: భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సెంటిమెంట్.. అంతకంటే మించి ఒక ధీమా. కాలం మారుతున్న కొద్దీ రూపాయి విలువ తగ్గుతుండవచ్చు కానీ, పసిడి విలువ మాత్రం ఆకాశమే హద్దుగా పెరుగుతూనే ఉంది. 1990 నుండి 2026 వరకు బంగారం ధరల ప్రస్థానాన్ని గమనిస్తే, సామాన్యుడి కొనుగోలు శక్తిని పసిడి ఎలా కాపాడుకుంటూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. దీనిని ఒక కిలో బంగారం ధరకు అప్పట్లో ఏ కారు వచ్చేది, ఇప్పుడు ఏ కారు వస్తోంది అనే కోణంలో చూస్తే ఆశ్చర్యకరమైన నిజాలు కనిపిస్తాయి.

1990 - 2010: మధ్యతరగతి కలల నుండి లగ్జరీ వైపు..

1990వ సంవత్సరంలో ఒక కిలో బంగారం ధర కేవలం రూ. 3.20 లక్షలు. అప్పట్లో ఈ ధరకు మధ్యతరగతి ప్రజల డ్రీమ్ కార్ అయిన 'మారుతి 1000' లభించేది. సరిగ్గా పదేళ్ల తర్వాత, అంటే 2005 నాటికి కేజీ బంగారం ధర రూ. 7 లక్షలకు చేరింది. అప్పుడు ఆ ధరకు మార్కెట్లో ఎంతో క్రేజ్ ఉన్న 'హోండా సిటీ' వంటి ప్రీమియం సెడాన్ కారును కొనుగోలు చేసే అవకాశం ఉండేది. అంటే పసిడి తన విలువను పదిలపరుచుకుంటూనే, పెట్టుబడిదారుడికి విలాసవంతమైన జీవనాన్ని అందించడం మొదలుపెట్టింది.

2010 - 2020: రికార్డుల వేట

2010 నాటికి బంగారం ధర రూ. 18.50 లక్షలకు చేరగా, హోండా అకార్డ్ వంటి ఎగ్జిక్యూటివ్ క్లాస్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక 2015లో ధర రూ. 26.34 లక్షలకు చేరడంతో ఫోర్డ్ ఎండీవర్ వంటి భారీ SUVలు పసిడి ప్రేమికులకు సొంతమయ్యేవి. 2020 కరోనా సంక్షోభ సమయంలోనూ బంగారం తన సత్తా చాటింది. కిలో ధర రూ. 48.65 లక్షలకు చేరడంతో, ఒక కిలో బంగారాన్ని విక్రయిస్తే బీఎండబ్ల్యూ X1 వంటి లగ్జరీ బ్రాండ్ ఇంటికి వచ్చేది.

2026: ఊహకందని స్థాయికి..

ప్రస్తుతం 2026లో బంగారం ధరలు ఆల్-టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. తాజా అంచనాల ప్రకారం కిలో బంగారం ధర సుమారు రూ. 1.54 కోట్లు పలుకుతోంది. 1990లో మారుతి కారుతో మొదలైన ఈ ప్రయాణం, నేడు 'మెర్సిడెస్ GLS' వంటి అత్యంత ఖరీదైన లగ్జరీ SUVని కొనే స్థాయికి చేరింది.

నిపుణులు ఏమంటున్నారు?

ద్రవ్యోల్బణం పెరిగినా, కరెన్సీ విలువ పడిపోయినా బంగారం తన విలువను కోల్పోదని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. అందుకే దీర్ఘకాలిక పెట్టుబడికి బంగారం మించిన ప్రత్యామ్నాయం లేదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడు తులం బంగారం తక్కువలో ఉన్నప్పుడు కొనలేకపోయామే అని బాధపడేకంటే, భవిష్యత్తు అవసరాల కోసం పసిడిలో పెట్టుబడి పెట్టడమే ఉత్తమ మార్గమని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News