YS Jagan: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష
YS Jagan: పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు, నాడు-నేడుపై సమీక్ష
YS Jagan: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష
YS Jagan: పేదలందరికీ ఇళ్ల కార్యక్రమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. వేయికి పైగా ఇళ్లు నిర్మిస్తున్న కాలనీలపై.. జిల్లాల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై కలెక్టర్లతో సమీక్ష జరిపిన సీఎం పలు సూచనలు చేశారు. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో 10 వేల 2 వందల కోట్లు ఖర్చు చేశామన్న సీఎం.. ఈ ఏడాది 15 వేల 8 వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇప్పించేలా చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రతీ శనివారం హౌసింగ్ డేగా పరిగణించి.. అధికారులు తప్పనిసరిగా రెండు లే అవుట్లను సందర్శించాలన్నారు. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని 48వేల మంది పేదలకు మే రెండో వారంలో ఇళ్ల పట్టాల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లూ చేయాలని తెలిపారు.
ఇక దేశంలో ఎక్కడా జరపని సమగ్ర సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు సీఎం. జగనన్న భూ హక్కు కార్యక్రమం దేశానికి ఆదర్శప్రాయమన్నారు. జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమం ద్వారా ఏపీకి సముచిత స్థానం లభిస్తుందని తెలిపారు సీఎం. మొదటి విడతలో 2వేల గ్రామాల్లో చేపట్టిన ఈ కార్యక్రమం తుదిదశకు చేరుకుంటోందన్న సీఎం జగన్.. త్వరగా తొలిదశను పూర్తి చేయాలన్నారు. కలెక్టర్లు భూ హక్కు పత్రాల పంపిణీతో పాటు... తర్వాత దశల్లో సర్వే చేయడంపై దృష్టిపెట్టాలని సూచించారు. పొరపాట్లకు తావులేకుండా కచ్చితమైన వివరాలతో భూ హక్కు పత్రాలు అందాలే చూడాలని ఆదేశించారు. మే 25 నుంచి రెండో దశ సర్వే ప్రారంభం అవుతుందన్నారు.