పరకామణి చోరీ కేసులో హైకోర్టుకు ఏసీబీ నివేదిక సమర్పణ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణిలో జరిగిన చోరీ కేసుకు సంబంధించిన నిందితుడు రవికుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) డీజీ ఒక మధ్యంతర నివేదికను ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు.
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరకామణిలో జరిగిన చోరీ కేసుకు సంబంధించిన నిందితుడు రవికుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) డీజీ ఒక మధ్యంతర నివేదికను ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు. నివేదికను పరిశీలించిన అనంతరం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలించాలని సీఐడీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
పరకామణి చోరీ వ్యవహారంపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు చాలా వరకు పూర్తి అయ్యిందని, అయితే కొన్ని అంశాలపై ఇంకా విచారణ మిగిలి ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పుల ప్రకారం, ఈ కేసులో పరిస్థితుల ఆధారంగా మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన అవకాశం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశాన్ని కూడా సీఐడీ పరిశీలించాలని సూచించింది.
ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను 2026 జనవరి 5వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అప్పటికి ఏసీబీ నివేదికపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.
పరకామణి కేసుకు సంబంధించి, నిందితుడు రవికుమార్ ఇటీవల ఒక వీడియో విడుదల చేశాడు. ‘‘ రెండేళ్ల క్రితం ఏప్రిల్ 29, 2023న పరకామణిలో తప్పు చేశాను. ఆ తప్పునకు ప్రాయశ్చితంగా నేను, నా కుటుంబం ఆస్తిలో 90 శాతం స్వామి వారికి ఇవ్వాలని అనుకున్నాం. అలాగే స్వామి వారి పేరుపై రాసి ఇచ్చాం. కానీ కొంత మంది దాన్ని ఇంకోలా మాట్లాడుతున్నారు. నా ఆస్తి స్వామి వారికి ఇవ్వడానికి, మరెవరికో ఏదైనా ఎందుకిస్తానో చెప్పండి?’’ అని ప్రశ్నించారు.