గర్భిణిలకు 'చిరునవ్వు'తో సూచనలు
మాతా, శిశు మరణాల్ని గణనీయంగా తగ్గించే చర్యల్లో భాగంగా 'కిల్కారి' (చిన్నారి చిరునవ్వు) కార్యక్రమం ద్వారా ఐవీఆర్ఎస్ విధానంలో గర్భిణిలు, బాలింతలకు సలహాలు,సూచనలు ఇస్తున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జి.వీరపాండియన్ తెలిపారు.
అమరావతి: మాతా, శిశు మరణాల్ని గణనీయంగా తగ్గించే చర్యల్లో భాగంగా 'కిల్కారి' (చిన్నారి చిరునవ్వు) కార్యక్రమం ద్వారా ఐవీఆర్ఎస్ విధానంలో గర్భిణిలు, బాలింతలకు సలహాలు,సూచనలు ఇస్తున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జి.వీరపాండియన్ తెలిపారు. ప్రతి ఏడాదీ ఐవీఆర్ఎస్ ద్వారా సగటున 2.5 లక్షల మంది గర్భిణులకు ఐవీఆర్ఎస్ వాయిస్ కాల్స్ ద్వారా తల్లి, బిడ్డల ఆరోగ్య సంరక్షణ, పోషణ, టీకాల ప్రాముఖ్యత, కుటుంబ నియంత్రణ, ఇతర అంశాలపై కనీసం 4 నిమిషాలపాటు వివరిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని తెలుగుతో పాటు 13 భాషల్లో నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఫోన్ నంబర్లను మార్చింది. జాతీయ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన పోర్టల్ (ఆర్సీహెచ్) లో గర్భిణిల వివరాల్ని చరవాణి నెంబరుతో సహా ఎ.ఎన్.ఎం. వివరాలు నమోదుచేసిన వెంటనే ఐవీఆర్ఎస్ కాల్స్ గర్భిణులకు వెళ్తాయి.
సాంకేతికంగా చేసిన మార్పుల్లో భాగంగా ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఫోన్ నెంబర్లను మార్చింది. ఐవీఆర్ఎస్ వాయిస్ కాల్స్ సంఖ్యను కూడా తగ్గించింది. అయితే, కంటెంటుపరంగా ఎటువంటి మార్పులు చేయకుండా విషయం నేరుగా, సంక్షిప్తంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. గర్భిణిల సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్కారి కార్యక్రమంపై ప్రజల్లో విస్తృతంగా అవగాన కల్పించాలని, ముఖ్యంగా జిల్లా వైద్యారోగ్య అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
నెలకో సారి వాయిస్ కాల్
ఇంతకుముందు నాలుగో నెలలో ప్రవేశించిన గర్భిణికి వారానికొకసారి చొప్పున ప్రసవం జరిగే వరకు ఐవీఆర్ఎస్ వాయిస్ కాల్స్ వెళ్లగా, తాజాగా నెలకోసారి వాయిస్ కాల్స్ వెళ్లేలా మార్పులు జరిగినట్లు రాష్ట్ర సమన్వయాధికారి డాక్టర్ శిరీష తెలిపారు. గతంలో ఉన్న నెంబరు(0124451660) స్థానంలో కొత్తగా 1600403 660 నెంబరును ఖరారు చేశారు. కిల్కారి రీ-డయల్ నెంబర్లను కూడా 14423/18001321255గా మార్చినట్లు అధికారులు వెల్లడించారు. కిల్కారి కార్యక్రమం పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని అధికారులు తెలిపారు.