సామర్లకోటలో సీపీఐ వందేళ్ల పండగ ప్రదర్శన

సీపీఐ శత దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా సామర్లకోటలో శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక మెహర్ కాపెక్స్ సెంటర్ నుంచి సీపీఐ వందేళ్ల పండగ ప్రదర్శన ప్రారంభమై, మెయిన్ రోడ్డు మీదుగా సీపీఐ కార్యాలయంకు చేరుకుంది.

Update: 2025-12-26 10:01 GMT

సామర్లకోట: రాజ్యాంగాన్ని దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి లౌకిక, ప్రజాస్వామ్య పార్టీలు, శక్తులను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు అన్నారు. సీపీఐ శత దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా సామర్లకోటలో శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక మెహర్ కాపెక్స్ సెంటర్ నుంచి సీపీఐ వందేళ్ల పండగ ప్రదర్శన ప్రారంభమై, మెయిన్ రోడ్డు మీదుగా సీపీఐ కార్యాలయంకు చేరుకుంది. ముందుగా అక్కడ సీపీఐ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకులు చెరుకూరి సుబ్బారావు మాస్టర్ ఎగరవేశారు. పార్టీ కార్యాలయం పున నిర్మాణ ఫలకాన్ని తాటిపాక మధు ప్రారంభించారు.


అనంతరం జరిగిన బహిరంగ సభకు పట్టణ కార్యదర్శి పి.సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మధు మాట్లాడుతూ, భారతదేశం ప్రస్తుతం సంక్షోభంలో ఉందిని, అనేక క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పారు. కేంద్రంలో మతతత్వ శక్తులు అధికారాన్ని హస్తగతం చేసుకున్నాయని అన్నారు. ఆ శక్తులు తమ చేతుల్లో ఉన్న రాజకీయ శక్తిని, ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి అంబేద్కర్ సహా మహానీయులు అందించిన రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నాయిని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు, రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన లౌకిక, ప్రజాస్వామ్య, సంక్షేమ దేశాన్ని మతతత్వ, ఫాసిస్టు శక్తుల, మతరాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. దేశాన్ని, దేశ చరిత్రను మార్చేందుకు రాజ్యాంగం నుంచి సెక్యులరిజం పదాన్ని తొలగించడమే లక్షంగా పెట్టుకున్నాయని మధు ఆందోళన వ్యక్తం చేశారు. విప్లవానికి నిలయం మన కార్యాలయాలు అని, సామర్లకోట సీపీఐ కార్యాలయం విప్లవ పోరాట కార్యక్రమాలకు, విప్లవోద్యమ సాహిత్యానికి నిలయమని, ఇక్కడికి వచ్చిన కమ్యూనిస్టు శ్రేణులు పోరాట స్ఫూర్తితో ముందుకు వెళతారని మధు అన్నారు. సీపీఐ వందేళ్ళ పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకు వేళ్లాలని మధు పిలుపు నిచ్చారు

ఇంకా ఈ సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె. బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పప్పు ఆదినారాయణ, శాఖ రామకృష్ణ, అన్నవరం, బొబ్బిలి శ్రీను, పార్టీ సీనియర్ నాయకులు చింతపల్లి సుబ్బారావు, కట్ట సత్యనారాయణ, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వై బాబు, మునిసిపల్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నంద కిషోర్, మహిళా సమాఖ్య నాయకురాలు అరుణ, ప్రజానాట్య మండలి కళాకారులు మడగల రమణ, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం పార్టీ సీనియర్ నాయకులకు సన్మానం చేశారు. 

Tags:    

Similar News