హద్దులు దాటిన టీడీపీ ఎమ్మెల్యేల జాబితా సిద్ధం
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రాజకీయాలపై ఇప్పుడు వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఈ చర్చంతా హద్దులు దాటిన టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపైనే జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ రాజకీయాలపై ఇప్పుడు వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఈ చర్చంతా హద్దులు దాటిన టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపైనే జరుగుతోంది. ఆ పార్టీలో ఇంత మంది ఎమ్మెల్యేలపై ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత చర్చ జరగలేదు. చాలా మంది ఎమ్మెల్యే ప్రవర్తన తీరుపై మొదటి ఆరు నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాక, పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోమని వారిని హెచ్చరించారు.
కొంతమంది ఎమ్మెల్యేలు బాగా రెచ్చిపోతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దాంతో, ఆ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో బాధ్యత లేకుండా వ్యవహరించే కొంతమంది ఎమ్మెల్యేల జాబితాని అధిష్టానం సిద్ధం చేసిట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల వారీగా ఈ ఎమ్మెల్యేల జాబితాపై దృష్టిపెట్టారని రాజకీయ వర్గాల సమాచారం. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో సీఎం చంద్రబాబు వన్ టూ వన్ మాట్లాడారు. సీఎంతో మాట్లాడిన తర్వాత కొంతమంది తమ వ్యవహారశైలిని మార్చుకున్నారు. ఇంకా కొంతమంది పరిస్థితిలో మార్పు రాలేదసి అధిష్టానం వద్ద సమాచారం ఉంది. తాజాగా అందిన నివేదికల్లో కొంత మందిలో ఏవిధమైనా మార్పురాలేదని, పైగా కొంతమంది మరీ రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో కొత్తగా ఎమ్మెల్యేలైనా వారిలో కొందరు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నట్లు అధిష్టానం దృష్టికి వెళ్లిందని సమాచారం.
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేల పీఏలు మరీ బరితెగించి ప్రవర్తిస్తున్నట్లు తీవ్రస్థాయిలో ఆలోపణలు వినవస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు తమ సామాజిక వర్గం వారినే పీఏలుగా పెట్టుకొని ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో అన్ని విషయాల్లో వారు తలదూరుస్తున్నట్లు ఫిర్యాదులు అందినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటువంటివారి వల్ల పార్టీ భారీ స్థాయిలో నష్టపోయే పరిస్థితులు ఏర్పడినట్లు పార్టీ వర్గాలు గగ్గోలుపెడుతున్నాయి.
నంద్యాల లోక్ సభ స్థానంలో ఐదుగురు ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి పని తీరుపై పార్టీ కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 8 మంది, విజయనగరం జిల్లాలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, శ్రీకాకుళం జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం.
పార్టీలో కీలక బాధ్యుడిగా ఉంటున్న మానవ వనరులు అభివృద్ధి, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆ ఎమ్మెలందరితో సమావేశమై, వారికి క్లాస్ తీసుకుంటారని తెలుస్తోంది. కొత్త ఏడాదిలో మంత్రి లోకేష్ ఈ కార్యక్రమం మొదలుపెట్టే అవకాశం ఉంది.
ఈ స్థాయిలో ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉంటే పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉందని అధిష్ఠానం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. వారిని తీవ్రస్థాయిలో హెచ్చరించి దారిలో పెట్టాలన్న ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉంది. అప్పటికీ మార్పు రాకపోతే, వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు తిరస్కరించే అవకాశం ఉంది.