MP Kesineni Nani: కేసీఆర్, జగన్ తోడు దొంగలే
MP Kesineni Nani: తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని టీడీపీ ఎంపి కేశినేని నాని విమర్శించారు.
TDP MP Kesineni Nani
MP Kesineni Nani: తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని టీడీపీ ఎంపి కేశినేని నాని విమర్శించారు.తెలుగు రాష్ట్రాల మద్య జలవివాదాలపై ఇరు రాష్ట్రాల మంత్రుల పరస్పర ఆరోపణల నేపథ్యంలో కేశినేని ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ విషమంపై సీఎం జగన్ స్పందించారు. తన తండ్రిపై, తన ప్రభుత్వంపై హద్దుమీరి తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఆంధ్రా ప్రాంత ప్రజలు తెలంగాణలో ఉన్నారని, అందుకే సంయమనంతో వ్యవహరిస్తున్నామని చెప్పారు.
ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం పెద్ద డ్రామాగా అభివర్ణించిన కేశినేని.. ఎన్నికల ముందు తర్వాత ఇద్దరి సీఎంల మధ్య పరస్పర సహకారం అందరికీ తెలిసిందే అన్నారు. తెలంగాణ ప్రజల్ని కేసీఆర్, ఏపీ ప్రజల్ని జగన్ పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో తన ఆస్తులు కాపాడుకునేందుకు నీటి వివాదంపై కేసీఆర్ తో కలిసి జగన్ ఆడే డ్రామానే ఇదంతా అని చెప్పుకొచ్చారు. ఎన్నికల తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు బొకేలు ఇచ్చుకుని ఆలింగనాలు చేసుకుంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందని తానూ భావించానని.. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇద్దరి నాటకాలని స్పష్టమైందన్నారు.
హైదరాబాద్ లో చెల్లి షర్మిలను పెట్టి, ఇక్కడ జగన్ ఆడే డ్రామాలు గమనించలేనంత పిచ్చోళ్లు ప్రజలు కాదని చెప్పారు. 80శాతం పూర్తయిన రాజధాని నిర్మాణాలు వదిలి కరకట్ట అభివృద్ధి చేస్తాననటాన్ని ఎలా చూడాలని కేశినేని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే రాజధాని అభివృద్ధిలో భాగంగా అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని సవాల్ విసిరారు. కేశినేని కామెంట్స్ పై రెండు రాష్ట్రాల సీఎం లు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.