ఏపీలో ఏసీబీ ఉచ్చు: మున్సిపల్ కమిషనర్ మహేశ్వర రావు నివాసాల్లో సోదాలు!
ఏపీలో అవినీతి అధికారుల నివాసాలపై ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి.
ఏపీలో అవినీతి అధికారుల నివాసాలపై ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. నిన్న వివిధ జిల్లాలో సోదాలు చేసిన అధికారులు తాజాగా ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీ కమిషనర్ మహేశ్వర రావు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదులతో అధికారులు రంగంలోకి దిగారు. ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఆరు ప్రత్యేక బృందాలుగా విడిపోయి కమిషనర్ నివాసం, కార్యాలయంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు.
ప్రధానంగా నరసరావుపేటలోని సాయినగర్ లో ఉన్న మహేశ్వర రావు నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న కాలంలో ఆయన భారీగా అక్రమ ఆస్తులు వెనకేశారన్న పక్కా సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. ఇంట్లోని విలువైన పత్రాలు, బ్యాంక్ లాకర్లు, బంగారం, ఇతర స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.