Tada: సేఫ్టీ సిటీగా శ్రీసిటీ - ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం

జాతీయ భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని, పారిశ్రామిక భద్రతకు పిలుపునిస్తూ... శ్రీసిటీ హెచ్ఆర్ ఫోరమ్ శ్రీసిటీలో తలపెట్టిన "ఇండస్ట్రియల్ సేఫ్టీ వాకతాన్ 2020" విజయవంతమైంది.

Update: 2020-03-05 07:15 GMT

శ్రీసిటీ: జాతీయ భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకుని, పారిశ్రామిక భద్రతకు పిలుపునిస్తూ... శ్రీసిటీ హెచ్ఆర్ ఫోరమ్ శ్రీసిటీలో తలపెట్టిన "ఇండస్ట్రియల్ సేఫ్టీ వాకతాన్ 2020" విజయవంతమైంది. అత్యధికంగా మహిళా కార్మికులతో, భద్రతా నినాదాల నడుమ ఎంతో ఉత్సాహంతో వాకతాన్ సాగింది. ఉదయం 7 గంటలకు జీరో పాయింట్ మైదానం వద్ద శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ (డీసీఐఎఫ్) శివకుమార్ రెడ్డి, సెజ్ డెవలప్మెంట్ కమిషనర్ ముత్తురాజ్, శ్రీసిటీ డీఎస్పీ విమలకుమారి లాంఛనంగా జెండా ఊపి నడకను ప్రారంభించారు.

సుమారు వంద పరిశ్రమల నుంచి వేలాది ఉద్యోగులు జీరో పాయింట్ నుంచి కొబెల్కో కూడలి వరకు 4 కిలోమీటర్ల మేర నడక సాగించారు. దేశంలో ఇదే అతిపెద్ద పారిశ్రామిక భద్రతా నడకగా, శ్రీసిటీ వాకతాన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సీనియర్ ప్రతినిధి వివేక్ నాయర్ జడ్జి దీనిని నిర్దారిస్తూ... శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందచేశారు.


ఈ సందర్భంగా వివేక్ నాయర్ మాట్లాడుతూ... భద్రతా ప్రాముఖ్యతను గుర్తించి మంచి కార్యక్రమం చేపట్టిన శ్రీసిటీ యాజమాన్యాన్ని అభినందించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందేందుకు 4 వేల మందితో 3 కిలోమీటర్ల నడక అర్హత కాగా, దానిని ఎంతో సులువుగా శ్రీసిటీ అధిగమించిందన్నారు. శ్రీసిటీ వాకతాన్ లో 5867 మంది పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీసిటీ పరిశ్రమలలో భద్రతా ప్రాముఖ్యతకు ఈ వాకతాన్ అద్దం పడుతోందంటూ డీసీఐఎఫ్ శివకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత పదేండ్లలో పరిశ్రమల లోపల ప్రమాదం ద్వారా ఒక్క మరణం కూడా సంభవించక పోవడం శ్రీసిటీ రికార్డుగా ఆయన పేర్కొన్నారు.

పరిశ్రమలలో భద్రత ఆవశ్యకత తెలియజెప్పడంతో పాటు, రాష్ట్రంలో పరిశ్రమలకు అనువైన భద్రతా వాతావరణం వుందని చాటి చెప్పడమే ఈ వాకతాన్ నిర్వహణ ఉద్ద్యేశ్యమని తెలిపారు. కనులపండుగగా వాకతాన్ సాగిందన్నారు. నిర్వాహకులకు కృతఙ్ఞతలు తెలిపారు. రికార్డు నెలకొల్పే ప్రత్యేక వాకతాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా, మరోసారి శ్రీసిటీ కమ్యూనిటీ తన సత్తా చాటి చెప్పిందని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు.


శ్రీసిటీలో ఇంత పెద్దఎత్తున పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్న మొదటి కార్యక్రమం ఇదే అన్నారు. ఇకపై ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. వచ్చే ఏడాది ఇంకా పెద్ద సంఖ్యలో వాకతాన్ నిర్వహించడం ద్వారా, తమ రికార్డును తామే అధిగమిస్తామని తెలిపారు. వాకతాన్ లాంటి మంచి ఆలోచన చేసిన డీసీఐఎఫ్ శివకుమార్ రెడ్డికి ఆయన కృతఙ్ఞతలు తెలిపారు.

కాగా, భద్రతా నినాదాలతో, ప్లేకార్డులు చేతబట్టి శ్రీసిటీ ఎక్సప్రెస్ హైవేలో నాలుగు కిలోమీటర్లు సాగిన సేఫ్టీ వాకతాన్ శ్రీసిటీ పరిసర ప్రజలను, చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. వాకతాన్ లో అత్యధిక కార్మికులతో పాల్గొన్న రైజింగ్ స్టార్ మొబైల్స్ ఇండియా లిమిటెడ్ (ఫాక్స్ కాన్) పరిశ్రమకు ప్రధమ స్థానం, ఇసుజు, ఐ-మాప్ లను ద్వితీయ, తృతీయ స్థానాలకు ఎంపిక చేస్తూ, వారికి ప్రత్యేక ప్రశంసా పత్రాలను అందచేశారు.

 

Tags:    

Similar News