Milk Adulteration: రాజమండ్రిలో కల్తీ పాల కలకలం.. ఐదుగురికి చేరిన మృతుల సంఖ్య
Milk Adulteration: రాజమండ్రిలో కిడ్నీ సమస్యలతో ఆస్పత్రుల్లో చేరిన వారిలో మరో ముగ్గురు మృతిచెందారు.
Milk Adulteration: రాజమండ్రిలో కల్తీ పాల కలకలం.. ఐదుగురికి చేరిన మృతుల సంఖ్య
Milk Adulteration: రాజమండ్రిలో కిడ్నీ సమస్యలతో ఆస్పత్రుల్లో చేరిన వారిలో మరో ముగ్గురు మృతిచెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. చికిత్స పొందుతూ లాలాచెరువు చౌడేశ్వరినగర్‌కు చెందిన శేషగిరిరావు, రాధా కృష్ణమూర్తితో పాటు మరొకరు ఈరోజు ఉదయం చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రాజమండ్రిలో ఒకే ప్రాంతానికి చెందిన పలువురు కిడ్నీ వ్యాధి సంబంధిత సమస్యలతో ఆస్పత్రుల్లో చేరడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రాజమండ్రిలోని లాలాచెరువు సమీపంలో ఉన్న చౌడేశ్వరినగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 15 తర్వాత నుంచి.. వాంతులవడం, మూత్రవిసర్జన కాకపోవడం, పొట్ట ఉబ్బడం లాంటి సమస్యలతో 14 మంది ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఇద్దరు మృతిచెందారు. బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడినవారే ఉన్నారు. 5 నెలల శిశువు, మూడేళ్ల బాలుడు కూడా ఈ బాధితుల్లో ఉండటం ఆందోళనకు గురిచేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనారోగ్యానికి గురవడంతో.. నిన్న వారు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఆసుపత్రుల పాలైన బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు పోస్తుండటంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చని వైద్యాధికారులు, బాధితులు పోలీసులకు తెలిపారు. ఈ నెల 15న పాలు, పెరుగు చేదుగా అనిపించాయని కొంతమంది బాధితులు విచారణలో చెప్పారు. కోరుకొండ మండలానికి చెందిన ఓ పాల వ్యాపారి వీరందరికీ పాలు పోస్తున్నట్లు గుర్తించడంతో పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. బాధితుల నుంచి సేకరించిన బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను.. టాక్సికాలజీ టెస్ట్ కు పంపించారు. ఆ నమూనాల నివేదికలు రావాల్సి ఉంది.
బాధితుల్లో భాగిశెట్టి కనకరత్నం అనే మహిళకు కిడ్నీలు దెబ్బతినగా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 20న మృతి చెందినట్లు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. మరో బాధితురాలు తాడి కృష్ణవేణి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు. ప్రస్తుతం రాజమండ్రిలోని 5 ప్రైవేటు ఆసుపత్రుల్లో 12 మంది చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో ఎక్కువమంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. సాధారణంగా వీరికి కిడ్నీలు పూర్తి సామర్థ్యంతో పనిచేయవు. ఈ క్రమంలో ఆహార కల్తీ జరిగితే, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.
బాధితులందరికీ ఒకే వ్యక్తి పాలు పోస్తుండటంతో అక్కడే కల్తీ జరిగి ఉండొచ్చని అధికారులకు, పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పాల శాంపిల్స్ ను విజయవాడ, ముంబైలోని ల్యాబ్స్ కు పంపారు. నివేదికలు వచ్చిన తర్వాత అసలు కారణం తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆ పాలవ్యాపారి రోజూ ఎవరికి పాలు పోస్తున్నాడో వివరాలు సేకరించి, ఆయా కుటుంబాలను సర్వే చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
కల్తీ పాల ఘటనపై జిల్లా వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. చౌడేశ్వరినగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో ప్రజలు అస్వస్థతతకు గురవ్వడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో పాటు రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో చేరిన కిడ్నీ బాధితులందరూ.. ఒకే వ్యక్తి దగ్గర పాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో, నీళ్లు, పాలు శాంపిల్స్ ను సేకరించి, టెస్టుల నిమిత్తం ల్యాబ్స్ కు పంపారు.
కిడ్నీ సంబంధిత సమస్యలతో పలు ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్న బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు డీఎంహెచ్‌వో తెలిపారు. పాలు, నీరు, ఇతర నమూనాలు సేకరించామని.. స్థానికంగా మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటుచేశామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాలో కిడ్నీ సంబంధిత వ్యాధి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. జిల్లా అధికారులకు ఫోన్ చేసి, తాజా పరిస్థితులను సమీక్షించారు మంత్రి కందుల దుర్గేష్. అనూరియా వ్యాప్తి నివారణ కోసం అధికార యంత్రాంగం ఎప్పటి కప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలి, తక్షణమే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు కందుల దుర్గేష్ భరోసా ఇచ్చారు.