Markapuram: ముగిసిన రథోత్సవం.. మార్కాపురంలో ఆధ్యాత్మిక సందడి

Markapuram: మార్కాపురంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

Update: 2026-04-11 15:18 GMT

Markapuram: ముగిసిన రథోత్సవం.. మార్కాపురంలో ఆధ్యాత్మిక సందడి

Markapuram: మార్కాపురం పట్టణంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అలంకారభూషితమైన రథంపై విహరిస్తూ స్వామివారు పట్టణంలోని నాలుగు మాడవీధుల్లో సంచరిస్తూ భక్తులకు దివ్య దర్శనం కలిగించారు. రథోత్సవాన్ని దర్శించేందుకు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ రథోత్సవంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తో పాటు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి హాజరై ఉత్సవంలో భాగమయ్యారు.

“జై చెన్నకేశవ… జై జై చెన్నకేశవ” నామస్మరణతో భక్తులు గళం విప్పి నినదించగా నాలుగు మాడవీధులు మారుమోగిపోయాయి. భక్తుల ఉత్సాహం, భక్తిరసం కలిసి పట్టణం అంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. మహిళలు, వృద్ధులు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథోత్సవాన్ని వైభవంగా తీర్చిదిద్దారు.

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో గొలమారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. తాగునీరు, వైద్య సదుపాయాలు, రద్దీ నియంత్రణ వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. డీఎస్పీ నాగరాజు పర్యవేక్షణలో సిఐ సుబ్బారావు సిబ్బందితో కలిసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి కార్యక్రమం సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.

Tags:    

Similar News